కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తంగా 21 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాకట, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ప్రవేశించింది. జైపుర్‌లో 9 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఒకేసారి ఇన్ని కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపుర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయట పడింది. వారితో పరిచయం ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన వారిని ఆర్యూహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న ప్రాంతంలో కర్ఫ్యూ విధించింది.
మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలోనే ఆర్టీపీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.