Thursday, November 21, 2024

ఒమిక్రాన్ అలజడి.. మళ్లీ లాక్ డౌన్ తప్పదా…

ప్ర‌భ‌న్యూస్ : కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచమంతా విలవిల్లాడింది. ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని నమ్మి ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. రెండుదశల కరోనా ముగిసి.. అంతా సర్దుకుందని భావిస్తున్న క్రమంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. తగ్గు ముఖం పడుతున్న కరోనా నుంచి ఇప్పుడిప్పుడు పలు దేశాలు కోలుకుంటున్నా యి. కరోనా విజృంభణ సమయంలో విధించిన‌ లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆర్థికంగా దెబ్బ తిన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతున్న సమయంలో ఇప్పుడు భారత్‌లో కూడా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రెండు నమోదు కావడంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది.

దక్షిణాఫ్రికాలో బయట పడ్డ ఒమిక్రాన్‌ ఇండియాకు వస్తుందా? వస్తే ఎలా ఎదుర్కో వాలి? అనే ప్రశ్నలతో అధికార యంత్రాంగం తలమునకలైంది. కోవిడ్‌ నుండి కోలుకుని విద్యారంగం గాడిన పడుతున్న క్రమంలో.. ఒమిక్రాన్‌ వ్యాప్తి హడలెత్తిస్తోంది. బెంగుళూరుకు చెందిన రెండు పాజిటివ్‌ కేసులు జినోమ్‌ ఫలితాల్లో ఒమిక్రాన్‌గా తేలడంతో భారత్‌లో మరోసారి టెన్షన్‌ మొదలైంది. ఒమిక్రాన్‌ సోకిన వారి కాంటాక్టు లిస్టును కూడా ట్రేస్‌ చేసి ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఒమిక్రాన్‌ సోకిన దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ నుంచి తెలంగాణకు వచ్చిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో జినోమ్‌ సీక్వెన్సీకి ఆమె శాంపిల్స్‌ను వైద్యులు పంపించారు.

ఒమిక్రాన్‌ కేసులు ఇండియాలో వెలుగు చూసిన నేపథ్యంలో భారతీయుల్లో మళ్ళీ లాక్‌డౌన్‌లు ఉంటాయా? పాఠశాలలు నడుస్తాయా? అన్న చర్చ జరుగుతోంది. మొదట కరోనా ఫస్ట్‌ వేవ్‌ వ్యాప్తి చెందినపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు మూడు నెలల పాటు లాక్‌డౌన్‌ విధించాయి. ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ రూపంలో మూడురెట్ల వేగంతో మరోసారి కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మరోమారు లాక్‌డౌన్‌ విధించక తప్పలేదు. అయితే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఆరురెట్ల వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌లో లాక్‌డౌన్‌ తప్పదా? అనే ప్రశ్న ప్రస్తుతం అందరి మదిలో మొదులుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒమిక్రాన్‌ను ఎంతమేర కట్టడి చేస్తాయో.. ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement