కరోనా మహమ్మారి చేప కింద నీరులా విజృంభిస్తోంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే, ఒమిక్రాన్ బారిన పడుతున్నా.. లక్షణాలు స్వల్పంగానే కనిపిస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్ గొంతుభాగంపై ప్రభావం చూపుతున్నది. శ్వాసనాళం, ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపటం లేదు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తటం లేదు.
ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతోంది. దీంతో ఆసుపత్రుల్లో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉంటున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా..స్వల్ప దగ్గు కూడా 6-7 రోజులకూ తగ్గకపోయినా.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.