కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మనకు ఒక వార్నింగ్ లాంటిదన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఇండియా అహెడ్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించారు. భారత్‌లో తగిన కొవిడ్ జాగ్రత్తలు పాటించడానికి ఒమ్రికాన్ ఒక వార్నింగ్ ఇస్తోందన్నారు సౌమ్య స్వామినాథన్. అలాగే కొత్త వేరియంట్ కట్టడికి పలు సూచనలు చేశారు స్వామినాథన్. ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని చెప్పారు.
మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని చెప్పుకొచ్చారు సౌమ్య స్వామినాథన్. వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్త వేరియంట్ స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమన్నారు. ఇక కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ అంశాలపై యూఎస్ శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు చేపడుతున్నట్లు తెలిపారు.