ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి ఎంతో వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మూడో వేవ్ ప్రారంభమైంది. భారత్‌లోనూ అదే ముప్పు మొదలైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఉద్దేశిస్తూ.. ప్రపంచ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వారంలో 71 శాతం కేసుల పెరుగుదల ఎంతో ఆందోళనకరమని తెలిపింది. కొత్త వేరియంట్ ప్రాణాంతకం అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫలితంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఆస్పత్రులు ఒమిక్రాన్ కేసులతో నిండిపోయాయని వివరించారు. కరోనా మహమ్మారిలో ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేమని టెడ్రోస్ అధనోమ్ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొంత మంది వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొంత మంది వ్యక్తులు మాస్కులు ముఖానికి కాకుండా గడ్డానికి ధరిస్తున్నారని, దాంతో ప్రయోజనం లేదన్నారు.
ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు..
డెల్టాతో పోలిస్తే.. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు. గతంలో వెలుగుచూసిన వేరియంట్స్ లాగే.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఇది మనుషులకు ఎంతో ప్రాణాంతకం అని హెచ్చరించారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో.. హెల్త్ కేర్ సిస్టమ్‌పై ఒత్తిడి కూడా పెరుగుతోందని తెలిపారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా బారినపడుతున్నట్టు వివరించారు. గత వారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9.5 మిలియన్‌ల కేసులు నమోదయ్యాయని, గత వారం కంటే 71 శాతం కేసులు అధికమని తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలే వ్యాప్తికి కారణం అయి ఉండొచ్చన్నారు. ఈ ఏడాదిలో ఆర్నేళ్లలోపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital