ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సంవత్సరం ఇదే చివరి మన్ కీ బాత్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టబోతోన్నామని పేర్కొన్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియపోలేదని హెచ్చరించారు.
ఈ ఏడాదిలో ఇదే చివరి మన్ కీ బాత్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు (ఆదివారం) తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 84వ ఎపిసోడ్‌లో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సంవత్సరం ఇదే చివరి ఎడిషన్ కావడం గమనార్హం. అయితే “మన్ కీ బాత్” అనేది ప్రధాని తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమంగా ప్రసారం అవుతోంది. ఇది ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ఉధయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్ కు సంబంధించిన అన్ని నెట్‌వర్క్ లలో, AIR వార్తలు, మొబైల్ యాప్‌లో కూడా ప్రసారం చేస్తారు. కాగా, మన్ కీ బాత్ తొలి ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రసారం అయ్యింది.
ఈ కార్యక్రమానికి ముందు ‘మన్ కీ బాత్’ ఎడిషన్ కోసం తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. “ఈ నెల 26న మన్ కీ బాత్ కోసం నాకు అనేక ఇన్‌పుట్‌లు అందుతున్నాయి, ఇది 2021లో చివరిది. ఈ ఇన్‌పుట్‌లు చాలా విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పనిచేస్తూ సామాజిక మార్పునకు కృషి చేస్తున్న అనేక మంది లైఫ్ జర్నీకి సంబంధించినవి కూడా ఉన్నాయి.. ఇట్లాంటి ఎన్నో అభిప్రాయాలను తరుచుగా నాకు షేర్ చేస్తూ ఉండండి” అని ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
ఈ సంక్లిష్ట సమయంలో మీరు తప్పనిసరిగా 2021కి వీడ్కోలు పలికి, 2022కి స్వాగతం పలికేందుకు రెడీ అవుతూ ఉంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, రాబోయే సంవత్సరంలో మెరుగ్గా ఉండేందుకు.. మరింత మెరుగైన పని చేయాలన్న సంకల్పం తీసుకుంటారు.
గత ఏడేళ్లుగా మన ‘మన్ కీ బాత్’ కూడా వ్యక్తి, సమాజం, దేశంలో ఉన్న పరిస్థితులు.. మారుతున్న విధానాలు.. మంచి నడవడిక వంటి అంశాలను తెలియజేయడం ద్వారా మంచి పనులు చేయడానికి.. గ్రాస్ రూట్ లెవల్ లో మరింత ఎఫర్ట్ గా పనిచేయడానికి మనల్ని ప్రేరిపించింది.
నా విషయానికొస్తే మన్ కీ బాత్ అనేది ప్రభుత్వ పనిని హైలైట్ చేయడం కాదు.. అది దశాబ్దాల కాలంగా మీడియాకు దూరంగా.. కనీసం వార్తా పత్రికలు చదివేందుకు వీలు లేని వారికి ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న పథకాలు, జరుగుతున్న మార్పులను సులభంగా చేరగలిగేలా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీంతో ఇది అట్టడుగు స్థాయిలో ఎంతో మందిని ఆలోచింపజేసేలా మారింది. వారిలో చాలామటుకు మార్పు తీసుకొచ్చింది.
ఇప్పుడు చాలామంది దేశ భవిష్యత్తు కోసం తమ అమూల్యమైన సమయాన్నికేటాయిస్తున్నారు. దేశంలోని రాబోయే తరాల కోసం ఈ రోజు ఎంతోమంది హృదయపూర్వకంగా పనిచేస్తున్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు. అలాంటి వారి మాటలు చాలామందికి ఓదార్పుగా నిలుస్తాయి.. స్ఫూర్తినింపుతాయి.
భారతదేశం COVID-19తో పోరాడుతోంది. ఇట్లాంటి కష్టతరమైన సమయంలో దేశ ప్రజలు సమయస్ఫూర్తితో కూడిన ప్రయత్నానికి ధన్యవాదాలు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మొదటి, రెండు డోస్ ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడంతో వ్యాధిని నివారించేందుకు మార్గం ఈజీ అవుతుంది. ఇది మన శాస్త్రవేత్తలకు ఓ సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.. అంతేకాకుండా ప్రజల్లోనూ జీవితంపై విశ్వాసాన్ని నింపుతుంది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో మనం COVID-19కి వ్యతిరేకంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (డిసెంబర్ 8న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, మరో 12 మంది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వరుణ్ కన్నుమూశారు) నుంచి వచ్చిన ఒక లేఖ నా దృష్టిని ఆకర్షించింది. నా హృదయాన్ని తాకింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తను ఒక్క విద్యార్థికి కూడా స్ఫూర్తినిస్తే అది కూడా చాలా ఎక్కువ అని రాశారు. కానీ, ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నా – అతను మొత్తం జాతికి స్ఫూర్తినిచ్చాడు.. సమాజానికి సందేశం ఇచ్చాడు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే వచ్చే ఏడాది ప్రారంభంలో పరీక్షా పె చర్చను నిర్వహిస్తాం. మనం మళ్లీ ప్రత్యేక బంధాన్ని ఏర్పరుచుకుందాం. ఎటువంటి కష్టతరమైన పరీక్షలను అయినా ఎదుర్కొని విజయాలతో సెలబ్రేట్ చేసుకుందాం..