దక్షిణాఫ్రికలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్ ను కలవరానికి గురి చేస్తోంది. దేశంలో ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని జామ్నగర్లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆఫ్రికాలోని జింబాబ్వే నుంచి ఇటీవల భారత్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జై ప్రకాశ్ శివరే ధృవీకరించారు. తాజా కేసుతో దేశోం ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
కాగా, దేశంలో తొలిసారిగా కర్ణాటకలోని బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం గురువారం(డిసెంబర్ 2) అధికారికంగా ప్రకటించింది. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని నవంబర్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.