ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 33,750 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఆస్పత్రల్లో ట్రీట్ మెంట్ తీసుకుని కోలుకున్న వారు 10,846 మంది డిశ్చార్జి అయ్యారి. అయితే వైరస్ కారణంగా 123మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,45,582 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో ఒమిక్రాన్ వైరస్ కేసులు కూడా చాలా వేగంగా వ్యాప్తిస్తున్నాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. దేశ వ్యాప్తంగా అటు కరోనా.. ఇటు ఒమిక్రాన్ స్పీడ్ పెరిగింది. దీంతో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 1700కు చేరుకున్నాయి. ఇప్పటివరకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఒమిక్రాన్ బాధతుల్లో మరో 639 మంది డిశ్చార్జి అయ్యారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర 510 కేసులతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ 351, గుజరాత్‌లో 136 కేసులు రికార్డయ్యాయి. కేరళలోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. కేరళలో ఇప్పటి వరకు 109 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వైరస్ పాకింది. ఆదివారం నాటికి 560 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నారు.
పశ్చిమ బెంగాల్స్‌లో కఠిన ఆంక్షలు
కరోనాతో పాటు కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుతం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కట్టడికి ప్రభుత్వం నేటి నుంచి (సోమవారం) కరోనా ఆంక్షలు అమలు చేయనుంది. పాక్షికంగా లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయించింది. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తరువాత బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా నేడు నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ విద్యాలయాలు సోమవారం నుంచి మూసివేయ నున్నట్టు స్పష్టం చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు శాతం 50శాతానికి తగ్గించనున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి వారానికి రెండు రోజులు సోమవారం, శుక్రవారం మాత్రమే విమానాలు నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై సోమవారం నుంచి నిషేధం విధించారు. స్విమ్మింగ్ పూల్స్, బ్యూటీ పార్లర్‌లు, జూలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్‌లో 50 శాతం మందిని అనుమతిస్తారు. మెట్రో రైళ్లలో కూడా 50 శాతం మందికే అనుమతి ఉంది.
ఆందోళన అక్కర్లేదు : సీఎం కేజ్రీవాల్
కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అయినా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీవాసులను ఉద్దేశించి మాట్లాడారు. కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని, 3,100 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6,360కు చేరుకుందని తెలిపారు. ఆస్పత్రుల్లో కేవలం 246 మంది మాత్రమే చేరారని, వారిలో చాలా మంది లక్షణాలు లేకుండా ఉన్నారని, మరికొందరు స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని తెలిపారు. రెండో వేవ్‌తో పోలిస్తే.. చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయని, 86 మంది మాత్రమే ఆక్సిజన్‌పై చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. 37000 పడకలు సిద్ధంగా ఉంచామని, తాజా కేసుల్లో ఎవరికీ ఎలాంటి లక్షణాలు ఉండటం లేవన్నారు. అయితే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించాలన్నారు.
మూతపడుతున్న స్కూళ్లు
పాఠశాలల పున:ప్రారంభం విషయంలో తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. నేటి నుంచి పాఠశాలలు తెరిచేందుకు ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా.. ఈ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. స్టాలిన్ ప్రభుత్వం కొన్ని తరగతులను మూసివేయించింది. ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు మార్గదర్శకాలు కూడా సవరించారు. 1 నుంచి 8వ తరగతి పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసి ఉంటాయి. 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు ప్రొటోకాల్‌ను అనుసరిస్తాయి. 1 నుంచి 5వ తరగతులు ప్రారంభించాలనే నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి ఎస్‌ఆర్ దాష్ తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు యథాతథంగా ఫిజికల్ క్లాసులు కొనసాగుతాయి.
మహారాష్ట్రలో త్వరలో లాక్‌డౌన్!
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. గడిచిన 24 గంటల్లో 9వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో లాక్‌డన్ విధించే ఆలోచన ప్రభుత్వాలని లేదని స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో పడకల ఖాళీలు, ఆక్సిజన్ వినియోగాన్ని పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. రోజుకు మెడికల్ ఆక్సిజన్ ఉపయోగం 700 మెట్రిక్ టన్నులు దాటితే.. లాక్‌డన్ విధిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సాయంత్రం నుంచి ఉదయం వరకు బీచ్‌లు, పార్కులు, జూలో అనుమతి నిరాకరించారు.
మూడో వేవ్ వచ్చేసింది : శివరాజ్ సింగ్ చౌహాన్
రాష్ట్రంలో మూడో వేవ్ వచ్చేసిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రజలు మరింత జాగ్రత్తగా మెలగాలని తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఉందని వివరించారు. ఈ కేసులను ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. వారి భాగస్వామ్యం లేనిదే.. ఈ పోరాటాన్ని జయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. గడిచిన 24 గంటల్లో 124 కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో 62, భోపాల్‌లో 27 కేసులు నమోదయ్యాయి.