భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. దక్షిణాఫ్రికలో వెలుగు చూసిన ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తూ ఇప్పటికే 94 దేశాలకు పాకింది. భారత్ లో ఒమిక్రాన్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలో ఇప్పటికే 200 కేసులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వరకు మొత్తం 213 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇందులో సగానికిపైగా కేసులు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదయ్యాయి.
వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్.. దక్షిణాది రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీలో57 కేసులు, మహారాష్ట్రలో 54 కేసులు వెలుగు చూశాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 24, కర్ణాటకలో 19 ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. రాజస్థాన్ లో18, గుజరాత్ లో 14 కేసులు రికార్డు అయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లో మూడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలో రెండు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, లడఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో కేసు నమోదైంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. “వార్ రూమ్”లను సిద్ధం చేయాలని రాష్ట్రాలను కోరింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం తదితర చర్యలు చేపట్టాలని సూచించింది.
మరోవైపు భారతదేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరి నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ ఇటీవల చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పీక్స్ లో ఉండనుందని ఆయన అంచనా వేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital