కరోనా సంగతేమో కానీ ఇప్పుడు ప్రపంచదేశాలన్నింటినీ గడ గడలాడిస్తుంది ఒమిక్రాన్..చాప కిందనీరులా ఇప్పటికే 77దేశాలలో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేసేందుకు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ను అంచనా వేయడంలో విఫలం అయ్యామని, ఒమిక్రాన్ వల్ల స్వల్ప తీవ్రత ఉన్న వ్యాధి సోకినా, దాంతో ఆరోగ్య వ్యవస్థపై మళ్లీ ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారి నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసాకి కూడా కోవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలతో ఆయన ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమానతలు ఉన్నట్లు టెడ్రోస్ తెలిపారు. ఒమిక్రాన్ వేళ కొన్ని దేశాలు బూస్టర్ డోసులు ఇస్తున్నాయని, కానీ ఇంకా కొన్ని దేశాలకు అసలు వ్యాక్సిన్లు అందలేదన్నారు. కోవిడ్ వ్యాప్తిని బూస్టర్ డోసులతో అడ్డుకోవచ్చు అని, కానీ ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్క్ లు తప్పనిసరి అని తెలిపారు. విరివిగా శానిటైజర్ వాడాలని సూచించారు. అవసరం అయితే తప్ప బయటకి రావొద్దన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..