లండన్ : ఒమిక్రాన్ దెబ్బకు బ్రిటన్ లో కలవరం మొదలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక రంగాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని ఆంక్షలు విధించారు. బ్రిటన్ కు వచ్చే యాత్రికులు ఐసోలేషన్ కు వెళ్లడం ఇక తప్పనిసరి. అలాగే రైళ్లలో, షాపులు, రెస్టారెంట్, ఇతర రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిందే. ఈ మేరకు నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఐరోపాలో పలు దేశాలు లాక్ డౌన్ దిశగా పయనిస్తుండగా జాన్సన్ సాధారణ మాస్క్ నిబంధనలతో సరిపెట్టడాన్ని విపక్ష పార్టీలు తప్పుపడుతుండగా, ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ఉండాలంటే ఇంతటితోనే సరిపెట్టాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
ఓ పక్క క్రిస్మస్ కు లాక్ డౌన్ విధించకపోతే ఒమిక్రాన్ దెబ్బకు బ్రిటన్ తల్లడిల్లిపోతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోపక్క లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక పరిస్థితి మళ్లీ ఆందోళనకర స్థాయికి చేరుతుందన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. అంతేకాకుండా వేసవి టూరిజానికి భారీగా బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. కాని, ఒమిక్రాన్ కేవలం మాస్క్, భౌతిక దూరం పాటించడంతో నియంత్రణ లోకి రాదని, టీకా తీసుకున్న వారిలోనూ వేగంగా వ్యాపిస్తోందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి.