Wednesday, November 20, 2024

భార్గవ్‌ కి నాకు ఎలాంటి సంబంధం లేదు:OMG నిత్య

సోషల్ మీడియాలో ఫన్ బకెట్ భార్గవ్, ఓమైగాడ్  నిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. వీరు టిక్ టాక్‌లో చేసిన ఓమైగాడ్ వీడియోలు గుర్తుకువస్తాయి. ఇందులో ఓమైగాడ్ ఓమైగాడ్ అంటూ భార్గవ్‌ తో కలిసి చేసింది నిత్య. అయితే ఇప్పుడు భార్గవ్ 14 ఏళ్ల మైనర్‌ని అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ మైనర్ బాలికను టిక్ టాక్ వీడియోల పేరుతో నమ్మించి వంచించాడని వార్తలు బయటకు రావడంతో.. చాలామంది ఓఎంజీ(OMG) నిత్య ఫొటోలు వాడుతూ ఈ బాలిక పేరుని తెరపైకి తీసుకుని వచ్చారు. చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో నిత్య ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నిత్య స్పందించింది. ఈ కేసుకి తనకు సంబంధం లేదని.. ఫన్ బకెట్ భార్గవ్‌ తో మాట్లాడి ఏడాదిపైనే అయ్యిందని తెలిపింది. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని వీడియోలో పేర్కొంది.

ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే అని, కానీ తనకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో తనకు కూడా అలాగే తెలిసిందని చెప్పింది. తన ఫాలోవర్స్ మెసేజ్ చేయడం వల్ల ఆ న్యూస్ చూశారని తెలిపింది. ‘’చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది?? అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్‌ వాళ్లు నా పేరు వాడుతున్నారు. నా ఫొటోలు వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారని తెలిసి.. క్లారిటీ ఇస్తున్నా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుంది’’ అంటూ నిత్య తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది.

కాగా, టిక్ టాక్, ఫన్ బకెట్ తో ఫేమస్ అయిన భార్గవ్‌.. 14 ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేశాడు. దీంతో ఇతనిపై దిశ యాక్ట్‌కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన భార్గవ్ గత కొంతకాలంగా ఫన్ బకెట్ పేరిట సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అతడికి విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల అమ్మాయితో పరిచయమైంది. ఫన్ బకెట్ వీడియోలు చూస్తున్న ఆమె భార్గవ్‌ను తరచూ కలిసేది. విశాఖపట్నం-విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ… భార్గవ్ గతంలో నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో కొంత పరిచయం పెరిగింది. అతడు కూడా ఆమెను చెల్లి అని పిలిచేవాడు.

చెల్లి అనే పిలుపుతో ఆమె కూడా భార్గవ్‌కు దగ్గరైంది. ఆమె తల్లి కూడా అతడ్ని అలాగే భావించింది. కానీ ఇటీవల ఆ అమ్మాయికి అనారోగ్యంగా ఉండటంతో తల్లి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌ను సంప్రదించగా నాలుగు నెలల గర్భవతని చెప్పారు. ఆమెను ప్రశ్నిస్తే.. ఆ గర్భానికి భార్గవ్ కారణం అని చెప్పింది. ఈనెల 16న తేదీన బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు.. ఫోక్సో చట్టం కేసు నమోదు చేశారు. భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

https://youtu.be/8t51JmIFzP0
Advertisement

తాజా వార్తలు

Advertisement