Friday, November 22, 2024

నీరజ్ చోప్రాకు ప్రశంసల వెల్లువ.. గోల్డెన్ బాయ్ కి రూ.6 కోట్ల నజరానా

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రాపై హర్యానా సర్కారు నజరానాల వర్షం కురిపించింది. టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజిక్కించుకున్నందుకు రూ.6 కోట్ల నగదు పురస్కారం అందించనుంది. దాంతోపాటే గ్రూప్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయించనున్నారు.

తన అద్వితీయ ప్రదర్శనతో దేశాన్ని గర్వించేలా చేసిన ఈ యువ అథ్లెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.  టోక్యో ఒలింపిక్స్ లో చోప్రా విశ్వరూపం ప్రదర్శించాడని అన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని  తెలిపారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఒక సంవత్సరం పాటు నీరజ్ చోప్రా కోసం అపరిమిత ఉచిత టిక్కెట్‌లను ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నందుకు గుర్తింపుగా ఆఫర్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్టు 8 నుండి ఆగస్టు 7, 2022 వరకు వర్తిస్తుంది. గోల్డెన్ బాయ్ నీరజ్ ను కొత్త SUV వాహనాన్ని ఇస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

టోక్యో ఒలింపిక్స్ చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని, ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో తొలి బంగారు పతకం అందించాడని అభినందించారు. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చోప్రా తర్వాతి తరం అథ్లెట్లు కంచుకోటలు బద్దలు కొట్టేలా స్ఫూర్తినందిస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.

 ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో భారత్ కు నీరజ్ చోప్రా తొలి స్వర్ణం అందించడం ద్వారా యావత్ దేశం పులకిస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. చారిత్రక విజయం సాధించిన చోప్రాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖులు సైతం నీరజ్ చోప్రా మహోన్నోత ప్రదర్శన పట్ల ముగ్ధులయ్యారు. భారత్ కు ఇది నిజంగా ఘనమైన తరుణం అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. అథ్లెటిక్స్ లో భారత్ కు ఒలింపిక్ స్వర్ణం… ఈ క్షణం కోసం 101 ఏళ్లు పట్టాయని అన్నారు. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడమే కాదు, చరిత్ర గతినే మార్చేశావు అంటూ కితాబునిచ్చారు.

నీరజ్ చోప్రా పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని సూపర్ స్టార్ మహేశ్ ట్వీట్ చేశారు. భారత్ కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లలో లభించిన తొలి స్వర్ణం ఇదని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement