కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల ఫేక్ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా యోగా గురువు బాబా రామ్ దేవ్ హాస్పిటల్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. వెంటిలేటర్ సహాయంతో ఆస్పత్రి లో ఉన్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. ‘ప్రాణాయామం గురించి అందరికీ నేర్పించే రామ్ దేవ్ బాబా నేడు వెంటిలెటర్‌పై ఉన్నాడు.. ఆక్సిజన్ గురించి ప్రజలకు బోధించే బాబా ఇప్పుడు వెంటిలేటర్‌లో ఉన్నాడు.. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టామన్న వారి పరిస్థితే ఇలా ఉందంటూ’ అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ పోస్ట్ నిజమైనదా కాదా అని తెలుసుకోకుండా షేర్లు చేస్తున్నారు.
బాబా రాందేవ్ ఆసుపత్రి లో వెంటిలేటర్ సహాయంతో ఉన్నారన్న వార్త లో ఏమాత్రం నిజం కాదు. ఇది 2011లో తీసిన ఫోటో. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తొమ్మిది రోజుల నిరాహార దీక్ష చేసిన తరువాత బాబా రామ్ దేవ్ డెహ్రాడూన్‌లో ఆసుపత్రి పాలైనప్పటి ఫోటో ఇది. రామ్ దేవ్ బాబా ఆసుపత్రిలో చేరారని,వెంటిలేటర్ మద్దతుతో ఉన్నారని పేర్కొంటూ వస్తున్న తాజా వార్తా కథనాలు నిజమైనవి కాదు. ఇలాంటి పోస్ట్ ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. బాబా రామ్ దేవ్ తాజాగా ఆస్పత్రి లో అడ్మిట్ అయిన వార్తలు ఏమీ లేవు. కేవలం ఇవి పుకార్లు మాత్రమే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.