ఎలక్ట్రిక్ బైకులు ఫైర్ యాక్సిడెంట్‌కు గురవుతున్న ఘటనల నేపథ్యంలో ఓలా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ 1,441 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ఆదివారం ప్రకటించింది. ఈ స్కూటర్లను ఇంజినీర్లు తనికీ చేయనున్నారు. అన్ని సిస్టమ్‌లలో డయాగ్నస్టిక్స్ ద్వారా తదుపరి చర్యలు తీసుకుంటారని ఓలా తెలిపింది. మార్చి 26న పూణెలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఓలా ఓ ప్రకటనలో తెలిపింది. ఓలా ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఘటన వ్యక్తిగతమైనదని తేలింది. ముందస్తు చర్యగా, తాము నిర్దిష్ట బ్యాచ్‌లోని స్కూటర్ల యొక్క వివరణాత్మక విశ్లేషణ, హెల్త్ ఇష్యూ వంటి వాటిని తనిఖీని నిర్వహిస్తామని, అందువల్ల 1,441 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ తన ప్రకటనలో తెలిపింది.
ఈ స్కూటర్లను మా సర్వీస్ ఇంజనీర్లు తనిఖీ చేస్తారని, అన్ని బ్యాటరీ సిస్టమ్‌లు, థర్మల్ సిస్టమ్‌లు అలాగే సేఫ్టీ సిస్టమ్‌లలో డయాగ్నస్టిక్స్ ద్వారా తర్వాత తీసుకునే సేఫ్టీ మేజర్స్ పాటిస్తారని కంపెనీ తెలిపింది. యూరోపియన్ స్టాండర్డ్ ECE 136కి అనుగుణంగా ఉండటంతో పాటు, భారతదేశం కోసం తాజా ప్రతిపాదిత ప్రమాణం AIS 156 కోసం దాని బ్యాటరీ వ్యవస్థలు ఇప్పటికే కట్టుబడి ఉన్నాయని.. అన్ని పరీక్షలు చేశామని Ola Electric తెలిపింది.
కాగా, ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తమిళనాడులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు విస్తృతంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే తయారీదారులు తమ వాహనాలను రీకాల్ చేయవలసి వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 11న తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఎలక్ట్రిక్ బైక్ పొగను వెదజల్లింది. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రీకూతుళ్లు మరణించిన తర్వాత రాష్ట్రంలో 3 వారాల్లో ఈ-బైక్‌లకు మంటలు అంటుకోవడం లేదా పొగను వెదజల్లడం ఇది నాలుగో సంఘటనగా వెల్లడయ్యింది. ఈ సంఘటనలు కంపెనీలను పరిశీలించడానికి, నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే జరిమానాల గురించి హెచ్చరించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.