ఒడిశా రాష్ట్రం నబ్రంగ్పూర్ జిల్లాలోని నాయక్గూడ గ్రామంలోకి ఓ అడవి ఎలుగుబంటి వచ్చింది. అది ఆహారం కోసం వెతుకుతూ గ్రామస్తుల దాడికి భయపడి చెట్టుపైకి ఎక్కడంతో ఊళ్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని చెట్టుపై నుంచి దించారు. అయితే అధికారులు దాన్ని కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశారు.
రెస్క్యూ మిషన్లో పాల్గొన్న 10 మంది సభ్యుల అటవీ బృందం ఆ ఎలుగును చెట్టు మీద నుంచి దించేందుకు ఎన్నో ప్లాన్లు వేసింది. చెట్టు దగ్గర ఉన్న గ్రామస్తులను దూరంగా పంపించేసి.. చెట్టు కింద మంచి ఆహారాన్ని ఉంచారు అధికారులు. దాన్ని కిందికి దింపడానికి నానా పాట్లు పడ్డారు. దాదాపు 54 గంటల పాటు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఎలుగుబంటిని శాంతింపజేయడంలో అధికారులు విజయం సాధించారు. కాగా, అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఎలుగుబంటిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. దానికి అవసరమైన చికిత్స అందించిన తర్వాత అడవిలో వదిలేస్తామని చెప్పారు ఫారెస్టు అధికారులు.