Tuesday, November 19, 2024

Big Story: ఒడవని ముచ్చట.. నాలుగైదు రోజుల్లో ఢిల్లీకి కాంగ్రెస్‌ సీనియర్లు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న పంచాయతీ ఇప్పట్లో చల్లారెటట్లుగా కనపించడం లేదు. సీనియర్లు, జూనియర్ల లొల్లి హస్తం పార్టీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ హై కమాండ్‌ పెద్దలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న అంతర్గత సమస్యలను నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు ఒక్కటవుతున్నట్లుగా తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో పలువురు సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీకి వెళ్లడానికి ముందు మరోసారి హైదరాబాద్‌లో ఒక సీనియర్‌ నాయకుడి నివాసంలో భేటీ కావాలని, అధిష్టానానికి చెప్పాల్సిన అంశాలపై చర్చించనున్నారు. పార్టీలో తమకు సరైన సమచారం, గౌరవం లేదని కొంత మంది సీనియర్లు ‘లాయలిస్టు కాంగ్రెస్‌’ పేరుతో ఇప్పటికే మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సమావేశం అయిన విషయం తెలిసిందే.

అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి తారిఖ్‌అన్వర్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, శశిధర్‌రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. అప్పుడే రాష్ట్ర పార్టీలో నెలకొన్న సమస్యలపై ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. అయితే ఈ భేటీల వెనుక మరో సీనియర్‌ నాయకుడు ఉన్నట్లుగా సొంత పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ పంచాయతీ ఇలా ఉండగానే మరి కొందరు నాయకులు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గత మూడు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో మరింత గందరగోళానికి దారి తీస్తోంది.

అధికార టీఆర్‌ఎస్‌తో గట్టిగా ఢీ కొట్టే పార్టీతో కలిసి పని చేస్తానని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్‌కు గుడ్‌ బై ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికంతటికి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలే కారణమని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ విభేదాలను పరిష్కరించే వారు లేకపోవడం కూడా హస్తం పార్టీకి చాలా మైనస్‌గా మారిందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నియమించిన దూతల తీరు కూడా తమకేమి పట్టనట్లుగానే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఏదైనా సమస్య వస్తే పరిశీలకులుగా వచ్చిన వారు వెంటనే ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే వారని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నేత అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌, ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శులుగా ఉన్న బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణన్‌లు పార్టీలోని అంతర్గత సమస్యలు తమకేమి పట్టనట్లుగానే వ్యవహారిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒక వర్గం చెప్పే మాటలను వింటూ, మిగతా నాయకులు ఏమి చెప్పినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే హై కమాండ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం అనవాయితని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పీఏసీలో చర్చించకుండానే టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటివి కాంగ్రెస్‌లో కుదురవని పార్టీ పరిశీల దృష్టికి సీనియర్లు తీసుకెళ్లారు. అయినా ఎలాంటి మార్పు రాలేదని, చివరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు సర్ధుకుంటాయా..? లేక ఇలానే కొనసాగుతాయా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement