Monday, November 25, 2024

TS | న‌ర్సుల క‌ల సాకారం.. హోదాల్లో పేర్ల‌ను మార్చిన తెలంగాణ ప్ర‌భుత్వం

ఉమ్మ‌డి మెద‌క్‌ బ్యూరో, ప్ర‌భ న్యూస్‌: తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్‌’ అని పిలిపించుకోవాలని ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కలలు సాకారం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో డ్యూటీ చేస్తున్న‌ నర్సింగ్‌ సిబ్బంది హోదాను ప్రభుత్వం ఉన్నతీకరించింది. వివిధ హోదాల్లో పేర్లను ‘ఆఫీసర్లు’గా మార్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన‌ట్టు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ హోదా మార్పు శనివారం నుంచే అమల్లోకి వస్తుందని అన్నారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. స్టాఫ్‌ నర్స్‌ను నర్సింగ్‌ ఆఫీసర్‌గా, హెడ్‌ నర్స్‌ను సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌-2ను డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌-1ను చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా పిలువనున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలోని దవాఖానల్లో పనిచేసే పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌లను పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా మార్చింది. వైద్యారోగ్య శాఖతో పాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్‌ సిబ్బందికి ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో పేరొన్నది. తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది నర్సులకు ప్రయోజనం కలుగనున్నది.

నర్సింగ్‌ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు
ప్రభుత్వ నర్సింగ్‌ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నర్సుల గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement