Monday, November 25, 2024

Spl Story | నో నారాజ్: బీఆర్ ఎస్‌లో ప‌ద‌వుల సంబురం.. దేశవ్యాప్తంగా కోరుకున్నోళ్ల‌కు కోరుకున్న చోట‌ చాన్స్​!

బీఆర్ ఎస్‌లో ప‌ద‌వుల సంబురం నెల‌కొంది. మొన్న‌టిదాకా రాష్ట్రానికే ప‌రిమిత‌మైన పార్టీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డంతో లీడ‌ర్ల‌కూ చాన్స్‌లు పెరిగాయి. గతంలో మాదిరిగా కాకుండా గులాబీ పార్టీ జాతీయ స్థాయికి విస్తరించిన నేపథ్యంలో పార్టీ పదవులకు కొదవ లేకుండా పోయింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించినందున ప్రస్తుతం పదవుల సంబురం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పదవులు అందుబాటులోకి వచ్చాయి. కోరుకున్నోళ్ల‌కు కోరుకున్న చోట‌ పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

బీఆర్ ఎస్‌లో దేశవ్యాప్తంగా రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడున్న సీనియర్లందరికీ జాతీయ రాజకీయాల్లో కీలక పదవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి లోతుగా కసరత్తు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేసీఆర్‌ తన జాతీయ పార్టీకి కొత్త కమిటీలను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేరేలా కేసీఆర్ ఈ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో, కొత్త కమిటీలను ప్రకటించనున్న నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో పలువురికి మళ్లీ పదవులు ద‌క్కుతాయ‌న్న ఆశ పెరిగిందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇక కేసీఆర్ జాతీయ పార్టీ పార్టీలో పదవులపై అసంతృప్తులకు అవకాశం కల్పించనుంది. పార్టీ అధినాయకుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న గులాబీ బాస్ అందుకు తగ్గట్టుగా పార్టీ కమిటీలను వేసే పనిలో ఉన్నారు. హిందీ బాగా మాట్లాడగలిగిన వారిని, దేశ రాజకీయాలలో ప్రభావవంతంగా ముందుకు వెళ్ల‌గలిగే వారికి కమిటీలలో స్థానం కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇప్పటికే గత టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసి, ఎలాంటి పదవులు లేని నాయకుల పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

వివిధ రాష్ట్రాలకు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ల నియామకంతో పాటుగా, అనుబంధంగా రైతు విభాగాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చాలామంది పదవుల కోసం లాబీయింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక కొందరు తమకు హిందీపై పూర్తిగా పట్టు కోసం ట్యూటర్ లను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకోవడానికి కుస్తీ పడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీలు వేయనున్న గులాబీ బాస్, పార్టీ సీనియర్లకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తారనే ప్ర‌చారం కూడా అప్పుడే మొద‌లైంది. రాష్ట్రస్థాయి నాయకులకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తే, రాష్ట్రస్థాయిలో ఏర్పడిన ఖాళీలలో ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్పు చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కొంతమంది అసంతృప్తులకు పదవులు దక్కినట్టు అవుతుంది.

- Advertisement -

ఇక‌.. గ్రామ స్థాయి నుండి, జాతీయ స్థాయి వరకూ అన్ని కులాలు, మతాలు, వర్గాలకు సమతూకంగా పదవులు ఇస్తారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు తర్వాత జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకలాపాల స్పీడ్ కూడా పెంచుతున్నట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. మొదటిగా మహారాష్ట్రలోని అమరావతిలో సభను ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతున్న కేసీఆర్ ఢిల్లీలోనూ బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈలోగానే కమిటీల ఏర్పాటు చేయనున్నట్టు, అందుకోసం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

కాగా, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది పదవులు రాలేదని తీవ్ర అసహనంతో ఉన్నవారికి, జాతీయ పార్టీ ఏర్పాటు అవకాశం కల్పించడంతో ఆయా వర్గాలలో మళ్లీ పదవులకోసం ఆశావహ దృక్పథం కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల ప్రకటన వెలువరిస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే, గెలుపు, ఓటముల మాట ఎలా ఉన్నా, దక్షిణ భారత దేశంలో బీ.ఆర్.ఎస్ పార్టీకి ఒకింత గుర్తింపు వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement