దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణు విస్ఫోటనాలకు దారి తీసే ఆయుధాలను తీసుకొనిపోగలిగే ఒక సరికొత్త వ్యూహాత్మక క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. వేల కిలోమీటర్ల రేంజ్‌ను సంతరించుకున్న అణ్వాయుధాలను కొనిపోయే బురెవెస్ట్నిక్ క్షిపణిని తొలిసారిగా పరీక్షించినట్టు చెప్పారు. అధ్యయనవేత్తలు, పాత్రికేయుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నవతరపు అణ్వాయుధాలకు కీలకమైన సార్మట్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ నిర్మాణ పనులను దాదాపుగా పూర్తి చేసినట్టు తెలిపారు.
విచక్షణతో కూడుకున్న ఏ ఒక్కరూ కూడా రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగించడానికి సాహసించరని అన్నారు. అలాంటి సాహసానికి ఎవరైనా ఒడిగట్టినట్టు గుర్తించిన పక్షంలో ”వందలాదిగా మా క్షిపణులు గగనతలంలో దర్శనమిస్తాయి. ఏ ఒక్క శత్రువుకు బతికి బట్ట కట్టే అవకాశం ఉండదు” అని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. సోవియట్ యూనియన్ పతనం కావడానికి ఏడాది ముందు అంటే 1990 తర్వాత రష్యా అణు విస్పోటన పరీక్షలను నిర్వహించింది లేదు. అయితే అణు పరీక్షలను తిరిగి చేపట్టే అవకాశాన్ని పుతిన్ తోసిపుచ్చలేదు. అణు పరీక్షలను రద్దు చేసే ఒడంబడికకు అమెరికా ఆమోదం తెలుపలేదని, కానీ రష్యా మాత్రం ఆమోదించడానికి తోడు సదరు ఒడంబడికపై సంతకం కూడా చేసిందని ఆయన చెప్పారు.
ఆమోదాన్ని రద్దు చేసే అవకాశం రష్యా పార్లమెంట్ డ్యూమాకు ఉందని తెలిపారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తరుణంలో రష్యా లేదా అమెరికా లేదా ఉభయ దేశాలు అణు విస్ఫోటన పరీక్షలను పునరుద్ధరించిన పక్షంలో అది అంతర్జాతీయంగా అస్థిరతకు దారి తీస్తుందనే ఆందోళనను మిలటరీ అధ్యయనవేత్తలు వ్యక్తం చేశారు. ఇరు పక్షాలకు అణ్వాయుధాలను మోహరింపజేయడంలో సంఖ్యను పరిమితం చేసే న్యూ స్టార్ట్ ఒడంబడికలో రష్యా భాగస్వామ్యాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో పుతిన్ రద్దు చేశారు.
అయితే అణ్వాయుధాల వాస్తవిక వినియోగంపై ఒక శాసనాన్ని తిరిగరాసే అవసరం రష్యాకు లేదని పుతిన్ తెలిపారు. రష్యాపై అణ్వాయుధ దాడికి స్పందనగా లేదా దేశ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిన సందర్భంలో అణ్వాయుధాలను వినియోగించవచ్చుననని సదరు శాసనం చెబుతోంది. అణ్వాయుధాల వినియోగాన్ని తగ్గించే అవకాశం లేదా అని రష్యా అధ్యయనవేత్త సెర్జీ కరగనోవ్ అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ”అలాంటి అవసరం ఉంటుందని నేను భావించడంలేదు. రష్యా సార్వభౌమత్వాన్ని లేదా రష్యా దేశపు అస్తిత్వానికి ముప్పు కలిగించే పరిస్థితి ప్రస్తుతానికి లేదని నేను చెప్పగలను. సరైన విచక్షణ, చక్కని జ్ఞాపక శక్తి ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా రష్యాపైకి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని నేనైతే అనుకోవడంలేదు” అని పుతిన్ అన్నారు.