ఎన్టీఆర్ హంతకులకు ఆయన పేరు ప్రస్తావించే అర్హత లేదని దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జరుగుతున్న రాజకీయంపై లక్ష్మీపార్వతి స్పందించారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు మార్పును ఆమె సమర్ధించారు. ఈ విషయంలో జగన్ వాదన సమర్ధనీయంగా ఉందన్నారు. అలాగే తనపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపైనా లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాల్ని ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో జగన్, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారు, దానిపై ఎల్లోమీడియా స్పందన అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉందన్న దానిపైనా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
తిరుపతిలో సాక్షుల సమక్షంలోనే ఎన్టీఆర్ తో తన పెళ్లయిందని, ఎన్టీఆర్ తో తన పెళ్లి చంద్రబాబుకు ముందునుంచీ ఇష్టం లేదని లక్ష్మీపార్వతి తెలిపారు. తమ పెళ్లిపై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. ఎన్టీఆర్ తో తన పెళ్లిపై మాట్లాడితే కేసులు పెడతానన్నారు. తాను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించానన్న విమర్శల్ని ఆనాడే ఎన్టీఆర్ ఖండించారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా తాను వద్దన్న విషయం మోహన్ బాబును అడిగితే చెప్తారని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని మోహన్ బాబుకు చెప్పారన్నారు. టీడీపీ విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. చంద్రబాబు-దగ్గుబాటి విభేధాల వల్లే టీడీపీ 1989లో ఓడిపోయిందని ఎన్టీఆర్ చెప్పారన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ పై 8 నెలల్లోనే ఊరికే అసమ్మతి వస్తుందా అని ఆమె ప్రశ్నిచారు. లక్ష్మీపార్వతికి అధికార కాంక్ష ఉంటే చంద్రబాబుకు రెండు కీలక శాఖలు ఎలా వచ్చేవని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబంలో రెండు ఆడ దుష్టశక్తులున్నాయని, ఎన్టీఆర్ కుటుంబంలో మగపిల్లలంతా అమాయకులేనన్నారు. ఎన్టీఆర్ గురించి ఇప్పుడు మాట్లాడటానికి పిల్లలు సిగ్గుపడాలన్నారు. ఎన్టీఆర్ కు నిజమైన వారసులు అభిమానులే తప్ప పిల్లలు కాదన్నారు. ఎమ్మెల్యేలను వైశ్రాయ్ హోటల్లో బంధించి ఎన్టీఆర్ కు సెక్యూరిటీ కూడా లేకుండా చేశారని, అప్పటి స్పీకర్ యనమల ఈ వెన్నుపోటులో భాగస్వామయ్యారని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు. ఎన్టీఆర్ వర్శిటీ పేరుమార్పుపై నిజమైన అభిమానులు బాధపడితే అభినందించాలని, ఎన్టీఆర్ హంతకులు దీనిపై మాట్లాడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు.