ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించింది హాలీవుడ్ నటి ఒలివియా..కాగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. తారక్ చాలా గొప్ప నటుడని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొనియాడింది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మొహంలో చిరునవ్వుతోనే సెట్ లోకి అడుగుపెట్టేవాడని, కానీ, ఆయన్ని చూడగానే తనకు టెన్షన్ పట్టుకునేదని తెలిపింది.
కొమురం భీముడో పాటలో తారక్ ను చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని ఒలీవియా చెప్పింది. ఆ పాటలోని సన్నివేశాలకు తాను భావోద్వేగానికి గురయ్యానంది. చరణ్ మంచి స్నేహితుడయ్యాడని, తామిద్దరం లండన్ లోని పరిసరాల గురించి మాట్లాడుకునేవాళ్లమని తెలిపింది. ‘నాటు నాటు’ పాటకు తన బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో ఎప్పుడూ ఆ పాటే పాడుతున్నాడంది.
కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. ఆర్ఆర్ఆర్ ఆడిషన్స్ కోసం వీడియో షూట్ చేసి పంపించానని చెప్పిన ఆమె.. కొన్ని నెలల పాటు టీమ్ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదని పేర్కొంది. కానీ, ఒకరోజు సడన్ గా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తనకు సడన్ గా ఫోన్ వచ్చిందని చెప్పింది. రాజమౌళి చాలా గొప్ప డైరెక్టర్ అని ఒలీవియా ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ లో కేవలం 20 రోజులే షూటింగ్ లో పాల్గొన్న ఆమె.. సిటీలో పెద్దగా తిరగలేకపోయానని, సెట్స్ లో అందరూ తనను బాగా చూసుకున్నారని చెప్పింది. ఇక సినిమాల్లో కెరీర్ పరంగా ఒలీవియాకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సినిమా. అయితే, ‘హోటల్ పోర్టోఫినో’ అనే బ్రిటీష్ టీవీ సీరియల్ తో ఆమె నటనలో అరంగేట్రం చేసింది.