Monday, November 25, 2024

Big Story: ‘రోస్టర్‌’ ఖరారు కాగానే నోటిఫికేషన్లు – ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపకల్పనలో ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా నియామక సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా 80,039 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇందులో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక, పోలీసు, వైద్య విద్య, రవాణా తదితర శాఖల్లోని ఖాళీల వివరాలు వెల్లడించి తదుపరి ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 30వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా రోస్టర్‌ ప్రాతిపదికన రిజర్వేషన్లు, పోస్టుల వారీగా విద్యార్హతలు, వయో పరిమితి, రాత పరీక్షల విధానం, ప్రభుత్వ నిబంధనలు, సిలబస్‌ కూర్పు తదితర అంశాలపై ఆయా ప్రభుత్వ శాఖలు దృష్టి సారిచాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ పీఎస్సీ), పోలీసు, వైద్య నియామక బోర్డుల అధికారులతో ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. రోస్టర్‌ విధానం ఎలా ఉండాలి, ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేయాలి, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఒక్కో పోటీ పరీక్షకు మరో పరీక్ష మధ్య ఎంత సమయం ఇవ్వాలి, పోటీ పరీక్షను ఎలా నిర్వహించాలి అన్న అంశాలపై ఆయా నియామక బోర్డులు చర్చోపచర్చలు సాగిస్తున్నాయి.

30వేలకు పైగా ఖాళీల భర్తీకి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులను వెలువరించిన ఆర్థికశాఖ అంతకన్నా ముందే రోస్టర్‌ తదితర అంశాలపై సాధారణ పరిపాలన శాఖ అధికారులతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగ ప్రకటన జారీకి ముందుగా ఆర్థికశాఖ అనుమతులు కీలకం కావడంతో ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసింది. తదుపరి సంబంధిత విభాగాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్‌, పరీక్షా విధానంపై ప్రతిపాదనలు రూపొందించి నియామక సంస్థలకు అందజేస్తాయి. ఈ ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నాయన్న నిర్ణయానికి వస్తే నియామక సంస్థలు వాటిని నిర్ధారించుకుని ఖాళీల భర్తీకి విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇప్పటికే అనుమతి పొందిన పోస్టుల్లో పోలీస్‌ నియామక సంస్థ పరిధిలో మొత్తం 16,804 ఖాళీల భర్తీకి ఆ సంస్థ చర్యలు చేపట్టింది. వచ్చే వారం, పది రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రోస్టర్‌ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖలకు లేఖలు రాసింది. ఏ పోస్టును ఏ కేటగిరికి కేటాయించారో ఆ శాఖల నుంచి స్పష్టమైన సమాధానం వచ్చిన వెంటనే పోలీస్‌ నియామక బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నిర్ణయించాల్సిన అర్హతలు, రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్‌ తదితర అంశాలపై హోంశాఖ సిద్ధమవుతోంది. ప్రతిపాదనలు పంపించాల్సిన అంశంపై పోలీస్‌ నియామక బోర్డు ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో 10,028 ఖాళీల భర్తీకి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ ప్రక్రియ మొదలైంది. టీఎస్‌ పీఎస్సీ పరిధిలో గ్రూప్‌-1 కింద 503 పోస్టులతో కలిసి మొత్తం 3,576 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కమిషన్‌కు ప్రభుత్వం అనుమతించింది. గ్రూప్‌-1 కింద ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన ప్రతిపాదనలపై అధికారులకు ఇప్పటికే ఒక అవగాహన కల్పించారు. రిజర్వేషన్లు, పోస్టుల వారీగా అర్హతలు తదితర అంశాలను సాధారణ పరిపాలనశాఖ ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లు, పోస్టుల వారీగా అర్హతలు తదితర అంశాలను అధికారులు ఇప్పటికే చర్చించారు. ప్రభుత్వ విభాగాలు వారం నుంచి పది రోజుల్లోగా పోస్టుల ప్రకారం రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్‌ తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.

దరఖాస్తుల స్వీకరణకు 45 రోజుల గడువు
నోటిఫికేషన్‌ జారీ మొదలు 45 రోజుల్లోగా అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని నియామక సంస్థలు కల్పించనున్నాయి. టీఎస్‌ పీఎస్సీతో పాటు మిగిలిన నియామక సంస్థలు ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తుండడంతో అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో టీఎస్‌ పీఎస్సీ వన్‌టైమ్‌ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టినా ప్రస్తుతం ఆ విధానం అమల్లో లేదని ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్లకు అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ మిగతా ప్రక్రియనంతా ఆన్‌లైన్‌ ద్వారానే కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నియామక సంస్థలు ప్రత్యేక వెబ్‌సైట్‌లను అమల్లోకి తెస్తారు. అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు సంస్థలు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్లను కేటాయిస్తారు. దీంతో పాటు ఈ-మెయిళ్ల ద్వారా అభ్యర్థులు తమకున్న సందేహాలను తెలియపరిస్తే వాటికి వెంటనే సమాధానం ఇచ్చేందుకు వీలుగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. వెబ్‌సైట్‌లో విద్యార్హతలు, వయో పరిమితి, పరీక్షా విధానం, సిలబస్‌, మోడల్‌ ప్రశ్నాపత్రాలు వంటివి అందుబాటులోకి తెచ్చేందుకు నియామక సంస్థలు కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువడిన రోజునే ఆయా నియామక సంస్థలు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement