పొలిటీషియన్స్.. వారి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసుకుంటారు. ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు తిట్ల దండకం మొదలెడదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. కానీ, ప్రశంసలు కురిపించడం అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. లేటెస్ట్ గా అట్లాంటి సిచ్యుయేషన్ ఒకటి జరిగింది. సినీ నటి, బీజేపీ మహిళా నేత, మాజీ సహచర నాయకురాలు కుష్భూ సుందర్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. బిల్కిస్ బానోపై సాముహిక అత్యాచారం, హత్య కేసు దీనికి ప్రధాన కారణం..
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ ఖైదీలుగా ఉన్న 11 మందిని ఇటీవల గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన పేరుతో విడుదల చేసింది. ఈ విడుదలను తప్పుపడుతూ కుష్భూ ట్వీట్ చేశారు. అత్యాచార దోషుల విడుదల మానవీయతకు, మహిళాజాతికి అవమానకరమని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అత్యాచారం, దాడులు, హింసకు గురైన మహిళకు తప్పక న్యాయం జరుగాలని, ఇలాంటి నేరలకు పాల్పడిన వారిని అస్సలు విడిచిపెట్టకూడదని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అట్లా విడిచిపెడితే స్త్రీ జాతికి అవమానమని అభిప్రాయపడ్డారు.
బిల్కిస్ బానోగానీ, మరో మహిళ గానీ ఈ తరహా దాడులకు గురైనప్పుడు పార్టీలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా మద్దతు తెలుపాల్సిన అవసరం ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు ఖుష్బూ.. ఇక.. దీనిపై స్పందించిన శశిథరూర్.. Hear hear, @khushsundar! అంటూ రీ ట్వీట్ చేశారు. మీరు రైట్ వింగ్ వైపు కాకుండా, రైట్ థింగ్ వైపు నిలబడినందుకు గర్వంగా ఉందని థరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.