Tuesday, November 26, 2024

పెంచింది ఎక్కువ, తగ్గించడం తక్కువా? ఇదేం తీరు అంటూ కేంద్రాన్ని నిలదీసిన మహారాష్ట్ర సీఎం

ఇంధన ధరలు తగ్గించినట్టు ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే మండిపడ్డారు. ముందు పెద్ద ఎత్తున సెస్​లు, పన్నుల రూపంలో పెంచడం ఎందుకు.. ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి గొప్పగా చెప్పుకోవడం ఎందుకని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఇంధన ధర తగ్గింపుపై స్పందిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం మరింత తగ్గించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 18.42 పెంచింది. ఇవ్వాల  దాన్ని  రూ. 8 తగ్గించింది. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం కూడా రూ. 18.24 పెరిగింది. ఇప్పుడు రూ. 6 తగ్గించారు.. అని ఉద్ధవ్ థాకరే  మండిపడ్డారు. ముందు విపరీతంగా ధరలు పెంచి ఆ తర్వాత నామమాత్రంగా ధరలు తగ్గించడం సరికాదని కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.  గణాంకాల వలయంలో చిక్కుకోకుండా ఆరు లేదా ఏడేళ్ల క్రితం ఉన్న ఎక్సైజ్ సుంకాన్నితీసుకొస్తేనే దేశ ప్రజలకు  నిజంగా ఊరట లభిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్​ అన్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8, డీజిల్‌పై రూ. 6చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల లీటరు పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని ఆమె తెలిపారు. ఎక్సైజ్‌లో ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను మరింత తగ్గించుకోవాలని సీతారామన్ సూచించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement