తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఇవ్వాల (ఆదివారం) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గడల సీఎం కేసీఆర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని, ఆయన పాదాలను తాకడం తన అదృష్టంగా భావిస్తా అన్నారు. ఈ మధ్య ప్రగతి భవన్లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభ కార్యక్రమంలో డీహెచ్ గడల శ్రీనివాసరావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. అయితే దీనిపై అప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా, ఆ కామెంట్స్‌కి ఇవ్వాల పుల్‌స్టాప్ పెట్టేశారు గడల శ్రీనివాసరావు.
తనపై కొందరు పనిగట్టుకుని కామెంట్స్ చేస్తున్నారని, ఈ విషయంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు డీహెచ్ శ్రీనివాసరావు. ప్రత్యేక తెలంగాణ సాధించిన జాతిపితగా, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పరిపాలనాధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌ని తాను పితృ సమానులుగా భావిస్తానన్నారు. కేసీఆర్‌తో ఫొటో దిగడ, ఆయన పాదాలను తాకడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తానన్న విషయాన్ని కొవిడ్ సమయంలోనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని, దీన్ని రాద్ధాంతం చేయొద్దని కోరారు.