శంకర్ పల్లి (ప్రభన్యూస్): శంకర్పల్లి నుంచి హైదరాబాద్ మహానగరానికి వెళ్లే దారిలోని దొంతాన్ పల్లి మీసేవా సెంటర్ వద్ద ఇలా భారీగా బారులు తీరారు గ్రామస్తులు. శంకర్ పల్లి మండలం, మున్సిపాలిటీ పరిధిలో మీసేవా అప్డేషన్స్ కోసం ప్రజలు నానా ఆవస్థలు పడుతున్నారు. ఆధార్ లో చిన్న మార్పులు చేయాలంటే సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని డిఫెన్స్ ఫ్యాక్టరీలో కానీ.. లేదా శంకర్పల్లి మండలంలోని దొంతన్ పల్లిలోని మీ సేవా కేంద్రం దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది.
కాగా, మండలపరిధిలో ఆధార్ అప్డేట్స్ కోసం సమస్య తీవ్రంగా ఉండడం వల్ల ఒక్కసారిగా జనం పోటెత్తడంతో మీసేవా సర్వర్లు హ్యాంగ్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో తెల్లవారుజామున 4 గంటల నుండి పెద్ద ఎత్తున జనం మీసేవా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఆధార్ అప్డేషన్స్ కోసం సెంటర్లను పెంచాలని కోరితే పెంచక పోగా, మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక మీసేవా సెంటర్ ను కూడా అధికారులు మూసివేశారు.
దీంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. పది రోజుల నుండి మీడియాలో కథనాలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. ఈ విషయంలో వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని, జనాల ఇబ్బందులు పరిష్కరించాలని పలువురు కొరుతున్నారు.