Friday, November 22, 2024

ప‌ని చేయ‌ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ – గాడిద‌కి క‌ట్టి ఊరేగించిన వ్య‌క్తి

ఈ మ‌ధ్య కాలంలో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు కొనుగోలు చేస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ప‌లు వాహ‌నాలు ఫైర్ అవ్వ‌డం, మొరాయించ‌డం జ‌రుగుతోంది. కాగా తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి.. అది పనిచేయకపోవడంతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదని కట్టి.. ఆ కంపెనీని నమ్మవద్దని కోరుతూ తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అయితే కొనుగోలు చేసిన కొద్ది రోజుల తర్వాత వాహనం మొరాయించింది. దీంతో అతడు కంపెనీ కస్టమర్ కాల్ సెంటర్‌కు కాల్ చేశాడు. అయితే అక్కడి నుంచి అతడు ఆశించిన స్పందన రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదను కట్టి రోడ్డుపై నిరసన తెలియజేశాడు. ‘‘మోసపూరిత ఓలా కంపెనీతో జాగ్రత్తగా ఉండండి’’, ‘‘ఓలా కంపెనీ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయకండి’’ అని రాసి ఉంచిన బ్యానర్లను ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారాయి. ఓ స్థానిక మరాఠి చానల్ షేర్ చేసిన వీడియోలో.. బైక్‌ను గాడిద లాగినట్టు కనిపిస్తుంది. మరోవైపు సచిన్ గిట్టే.. వినియోగదారుల ఫోరమ్‌ను కూడా సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఓలా కంపెనీ బైక్ రిపేర్ గానీ, రిప్లేస్ గానీ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓలా నుంచి వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక రక్షణ లేదని ఆరోపించిన అతడు… ప్రభుత్వం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక, సచిన్ గిట్టె.. 2021 సెప్టెంబర్‌లో స్కూటర్‌ను బుక్ చేసుకున్నాడు.. అది 2022 మార్చి 24న డెలివరీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement