Friday, November 22, 2024

నిమ్స్‌లో ఆగని అక్రమ దందాలు

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆవరణలో పార్కింగ్‌ దోపిడి యథేచ్ఛగా సాగుతోంది. మినిమం చార్జీలను అటకెక్కించిన కాంట్రాక్టర్‌ సొంత చార్జీలను అమలు చేస్తున్నాడు. అగ్రిమెంట్‌ ప్రకారం సైకిల్‌కు రూ.5, మోటార్‌ సైకిల్‌/స్కూటర్‌/కార్‌కు రూ.10 చొప్పున ఆరుగంటలకు వసూలు చేయాలి. అలాగే 24 గంటలకు గాను సైకిల్‌కు రూ10, మోటార్‌ సైకిల్‌/స్కూటర్‌కు రూ.20 కార్‌కు రూ.50 వసూలు చేయాలి. 6గంటల కనీస సమయాన్ని మింగేసి అగ్రిమెంట్లో లేని విధంగా మినిమం చార్జీ అంటూ 10 నిమిషాలు పార్కింగ్‌ చేసినా మోటార్‌ సైకిల్‌/స్కూటర్‌ కు రూ.10, కార్లకు రూ.40 వసూలు చేస్తున్నాడు. మల్టిప్లే ఎంట్రీ పేరుతో మినిమం రేట్లకు మంగళంపాడి ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నాడు. చార్జీల వసూలుకు ఎలక్ట్రానిక్‌ మిషన్లు మాత్రమే వాడాలి. అందులో వాహనం నెంబర్‌, టైమ్‌, డేట్‌ తప్పనిసరిగా పొందుపర్చాలి. కాని కాంట్రాక్టర్‌ ఎలక్ట్రానిక్‌ మిషన్ల కు బదులుగా మ్యాన్‌వల్‌ రశీదులను అందిస్తున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం నిర్దేశించిన పార్కింగ్‌ రేట్లను అన్ని పార్కింగ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. కాని ఇప్పటి వరకు ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఇందుకు సంబంధించి ఎవరైనా వాహనదారుడు ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండని పార్కింగ్‌ సిబ్బంది బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

రోగుల ఆరోగ్యంతో క్యాంటిన్ల చెలగాటం..

నిమ్స్‌ ఆస్పత్రిలో రెండు క్యాంటీన్లు ఉన్నాయి. ఒకటి ప్రారంభం గేటు వద్ద కాగా, రెండవది మిలినియం బ్లాక్‌ సమీపంలో ఉంది. రెండు క్యాంటీన్లు సైతం నిబందనలకు విరుద్ధంగా జంక్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ అమ్మకాలను అక్రమంగా కొనసాగి స్తున్నాయి. వాటికి తోడు కంపుకొడుతున్న క్యాంటిన్‌ ప్రాంగణంలో నాణ్యతలేని ఆహా రాన్ని ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు. రోగులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందిచాల్సింది పోయి, నిబంధనలకు విరుద్ధంగా జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ అమ్మకాలు కొనసాగిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ క్యాంటిన్‌పై చర్యలు తీసుకుని రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పలువురు కోరుతున్నారు.

జెనరిక్‌ మందులకు మంగళం..

నిమ్స్‌ ఆవరణలో రోగుల సౌకర్యార్థం మొత్తం మూడు మందుల దుకాణాలకు అనుమతి ఇచ్చారు. స్పెషాలిటీ బ్లాక్‌ ఆవరణలో ఏజీ ఫార్మసికి, ఆంధ్రాబ్యాంక్‌ ముందు ఎంజీ మెడికల్‌ స్టోర్స్‌, అలాగే హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌ అనే ప్రభుత్వరంగ సంస్థ కు అనుమతి ఇచ్చారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వచ్చే ఈ ఆస్పత్రిలో మందుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌ కేర్‌ లిమిటెడ్‌కు నామినల్‌ అద్దెపై 6 జూన్‌, 2016లో రెండేండ్ల కాలానికి అనుమతిచ్చారు. నెలకు రూ.లక్ష అద్దెగా, రెండేళ్ల కాలానికి గాను 6 జూన్‌ 2016లో అనుమతిచ్చారు. ఆ తర్వాత 2020లో ఒకసారి, తాజాగా మరోసారి ఎలాంటి టెండర్‌ లేకుండానే గడువు పెంచారు. జనరిక్‌ మందులనుఅం దుబాటులో ఉంచి వాటిపై 50శాతం, బ్రాండెడ్‌ మందులపై 10శాతం తగ్గింపు నివ్వాలనే కండీషన్‌తో అతి తక్కువ అద్దెతో అనుమతించినప్పటికీ, అగ్రిమెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మందులషాపులో జనరిక్‌ మందులను అందుబాటులో ఉంచక పోగా, బ్రాండెడ్‌ మందులపై రోగులకు డిస్కౌంట్‌ ఇవ్వలేదనే విమర్శలున్నాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మందులను తక ు్కవ ధరలో అందిస్తుందనే సదుద్దేశంతో నామమాత్రపు అద్దెతో ఇచ్చిన అనుమతిని సదరు సంస్థ దుర్విని యోగం చేసిందనే ఆరోపణలున్నాయి. అయినా అదే సంస్థ కు ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంలో అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

అనుమతి లేకుండానే దుకాణాలు..

నిమ్స్‌ ఆవరణలో పలుకుబడి పైరవి ఉంటే ఎలాంటి అనుమతి లేకుండా, అస్పత్రికి ఎలాంటి రుసుం చెల్లించకుండా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. స్పెషాలిటీ బ్లాక్‌ పార్కింగ్‌ స్థలంవద్ద వెలిసిన బడ్డీ కొట్టే ఇందుకు నిదర్శనం. ఈ షాపు ఏర్పాటుకు నిమ్స్‌ ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి టెండర్‌ పిలువలేదు. అయినా ఇక్కడ అన్నిరకాల వ్యాపారం సాగుతోంది. ఈ అక్రమ దందాకు ఆస్పత్రికి ఓ ఉన్నతాధికారి అండదండలే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement