ప్రభన్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గతంలో ఉన్నంత ఉపాధి లేకుండా పోయింది. కరోనా తర్వాత వ్యాపారాలు తగ్గిపోవడంతో సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. దీనితో చాలా మందికి పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా పని ఉన్నప్పటికి వేతనాలు తగ్గించి ఇస్తున్నారు. దీనితో సామాన్య, మధ్య తరగతి వారి ఆదాయం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చులతో జీవన బతుకు చిత్రం ఆగమవుతుంది. లక్షలాది కుటుంబాలకు ఆసరగా నిలిచిన భాగ్యనగరంలో ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి. ఏడాదిన్నర రెండు సంవత్సరాల కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. గ్యాస్ ధర రూ. వెయ్యి దాటింది. వంట నూనెలు, ప ప్పులు, నిత్యావసర వస్తువులతో పాటు నిర్మాణ రంగంలో కీలకమైన స్టీల్, సిమెంట్, ఇసుక వంటి ముడి సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
జనవరిలో రూ. 135 నుంచి రూ. 140 ఉన్న మంచి నూనె ధర నేడు రూ.రెండు వందలు దాటింది. ఏ వస్తువు తీసుకున్న జనవరిలో ఉన్న ధరల కన్నా 40 శాతం నుంచి 50 శాతం ధరలు పెంచి అమ్ముతున్నారు. గ్యాస్ సిలిండర్ జనవరిలో రూ. 952లు ఉండగా ప్రస్తుతం రూ. 1002 లకు చేరింది. చికెన్ ధర రూ. 160 నుంచి రూ. 280కి చేరుకుంది. టన్ను స్టీల్‌కు జనవరిలో రూ. 60 వేలు ఉండగా ప్రస్తుతం అది రూ. 85 వేలకు పైగా దూసుకపోతుంది. సిమెంట్ బస్తా ధర రూ. 250 నుంచి రూ. 380కి చేరుకుంది. దీనితో రియల్ రంగంలో ఉన్న వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక డీజిల్ ధర రూ. 94.18 నుంచి రూ. 102-40లకు చేరుకోగా పెట్రోల్ రూ. 108.17ల నుంచి రూ. 116-50లకు చేరుకుంది. ఈ నెల 1వ తేదీ నుంచి యూనిట్‌కు 50 పైసలు విద్యుత్ చార్జీలు పెరిగాయి. మరో వైపు ఆర్టీసీ బస్సు చార్జీలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో క్యాబ్, ఆటో చార్జీలు సైతం పెరుగుతున్నాయి. కానీ శ్రమనే నమ్ముకున్న పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పెరుగుతున్న ధరలను చూసి బేంబేలెత్తుతున్న జనం బతుకు వెళ్ళదీసేదేలా అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నగరంలో బతకడానికి పనులు లేక , ఇళ్ళ అద్దెలు చెల్లించలేక సొంత గ్రామాలకు వెళ్ళిపోగా, ఉన్న వారికి పని చేసినా సంతృప్తి కరమైన ఆదాయం దక్కడం లేదు.
దీనితో గతంలో కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకున్న వారు బతకడం కోసం ఖర్చు చేస్తుండడంతో హారతి క ర్ఫూరంలా కరిగిపోతున్నాయి. కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోయిన వాణిజ్య , వ్యాపార సంస్థలు గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి సదరు వ్యాపార , వాణిజ్య సంస్థల యాజమానులు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఇందులో భాగంగా పని కార్మికుల వేతనాలు కూడా తగ్గడంతో దాని ప్రభావం జీవితంపై పడుతుంది. దీనితో వేతన జీవులకు సరిపడ ఆదాయం లేక బతుకు బండిని లాగడం కష్టంగా మారింది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఒక చేత్తో ఇచ్చి మరో చేతితో లాక్కుంటున్నారు. సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం ఇస్తున్నారు. పేట్రోల్, డీజిల్ ధరలను పెంచి నిత్యావసర వస్తువులపై పెరుగుతున్న ధరలపై పన్నుల రూపంలో రెట్టింపు లాక్కుంటున్నారు. ధరలు నియంత్రించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ధరల పెరుగుదల భారం మాత్రం పేదోడిపైనే ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ కష్టజీవి మాత్రమే కాకుండా యాజమాని సైతం నష్టాల బాటలో పయనించారు. వ్యాపారం లేక ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడింది. . పెరుగుతున్న ధరలతో సామాన్యుడి గుండె లబ్‌డబ్ అంటు వేగంగా కొట్టుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. గత ఏడాది కాలంగా ఉన్న ధరల పట్టికను గమనిస్తే సామాన్యుడి బతుకు పరిస్థితి అర్థం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..