Saturday, November 23, 2024

బీపీ, షుగర్‌, గొంతు, బ్రెస్ట్‌ క్యాన్సర్లు.. అసంక్రమిత వ్యాధులతోనే అధిక ప్రాణ నష్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అనారోగ్యంతో మృతిచెందుతున్న వారిలో ఎక్కువ శాతం అసంక్రమిత వ్యాధులతో (గుండె, క్యాన్సర్‌, బీపీ, షుగర్‌ తదితర) కన్నుమూస్తున్నారు. మరణాల్లో అత్యధికంగా గుండె వ్యాధులు, నవజాత శిశు మరణాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 59.2శాతం ఈ కోవలోనివే. మరోవైపు రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 13.2శాతం ప్రమాదాల బారిన పడటం ద్వారా చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాలను రాష్ట్ర ఎకనామిక్‌ సోషియో సర్వే స్పష్టం చేసింది. సంక్రమిత వ్యాధుల్లో ఎయిడ్స్‌, టీబీ, దోమకాటు వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వ్యాధులు ప్రజలను బలితీసుకుంటున్నాయి. తెలంగాణను సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల రహితంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతోంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బంధీగా అమలు చేస్తున్నట్లు సర్వే వెల్లడించింది.

బీపీ, షుగర్‌, గొంతు, బ్రెస్ట్‌ క్యాన్సర్లు రాష్ట్రంలో పెరిగిపోతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 వెల్లడించింది. ఈవ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, అవి ముదరకుండా కట్టడి చేసేందుకు తెలంగాణలో 7 ఎన్‌సీడీ క్లినిక్‌లను, 47 సీహెచ్‌సీ ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేసి స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక ఎన్‌సీడీ క్లినికల్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మరోవైపు రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధిని కట్టడి చేసేందుకు 1194 ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ టెస్టింగ్‌ కేంద్రాలను నెలకొల్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.58లక్షల మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారు.

సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల పనిపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు సర్వే ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధులను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి , వాటి కట్టడికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతీ ఒక్కరికి హెల్త్‌ కార్డును ఇవ్వటం ద్వారా వారి ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తంచేసి విపత్కర సమయాల్లో సమర్థమైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతుందని సర్వే వెల్లడించింది. పట్టణ పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువచేసేందుకు 500 నుంచి 10000 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసి 53 రకాల వైద్య సేవలు, పరీక్షలను అందిస్తున్నారు. దీంతో పేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందుతోంది. త్వరలో సాకారం కానున్న పల్లె దవాఖానాల ఏర్పాటుతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందనుందని సర్వే తేల్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement