ముంబైలో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ త్వరలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరుగుతుందని ఇవ్వాల (ఆదివారం) ఆయన మీడియాకు చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీనికి చొరవ చూపారని, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు ఆమె లేఖలు కూడా రాశారని అన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాల్సిన అవసరాన్ని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారని సంజయ్ రౌత్ తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవారు చర్చించారన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతోపాటు మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందన్నారు. కాగా, దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని తప్పుపడుతూ 13 విపక్ష పార్టీల నేతలు శనివారం బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది.