కాళేశ్వరం వాటర్ జంక్షన్‌కి కష్టకాలం
వాటర్ బ్యాలెన్సింగే అతి పెద్ద సమస్య
గోదావరి నుంచి నిలిచిపోయిన రివర్స్ పంపింగ్
మిడ్ మానేరుకు ఆగిపోయిన నీటి సరఫరా
ఎత్తిపోతలు లేక కానరాని గోదావరి నీళ్లు
మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్‌లన్నీ ఖాళీ
నీళ్లు అడుగంటి పైకి తేలిన ముంపు గ్రామాలు
మల్టీ ఫేజ్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో కాళేశ్వరం కీలక పాత్ర
13 జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీటి లక్ష్యం
యాసంగిలో నీరందక ఎండిపోయిన పంటలు
వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇక్కట్లు
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి గండం తప్పదా?
ఆంధ్రప్రభ స్మార్ట్, స్పెషల్ డెస్క్ – కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మూడు ప్రధానమైన బరాజ్‌లు. వీటి ద్వారానే రివర్స్ పంపింగ్‌తో గోదావరి నీటిని పైకి తరలిస్తున్నారు. 2023 నవంబర్‌లో మేడిగడ్డ బరాజ్ పిల్లర్లలో పగుళ్లు గుర్తించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఎగువన ఉన్న అన్నారం బరాజ్‌లో లీకేజీ సమస్యలు బయటపడ్డాయి. దీంతో ఈ మూడు బరాజ్‌ల నీటిని పూర్తిగా ఖాళీ చేశారు. ప్రస్తుతం ఎలాంటి నిల్వ, తరలింపు లేదు. దీంతో మిడ్ మానేరుకు కాళేశ్వరం నీరు ఆగిపోయింది. దీని ప్రభావం మిడ్ మానేరుతో లింక్ అయిన అన్ని రిజర్వాయర్లపై కనిపిస్తోంది. 27.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరులో ప్రస్తుతం (ఏప్రిల్ 10 నాటికి ) 7.02 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇదే కారణంగా బ్యాక్ వాటర్ తగ్గిపోయి ముంపు గ్రామాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 5 మధ్య కాలంలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నుంచి 10.37 టీఎంసీల నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు ఇతర ప్రాజెక్ట్‌లకు తరలించారు. గతేడాది ఇదే సమయానికి మిడ్ మానేరులో 20.60 టీఎంసీల నిల్వలు ఉన్నాయి.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఒక ‘బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’. అంటే, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిని ఇక్కడ నిల్వ చేసి అవసరం మేరకు మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉంటుంది. ఇలా తరలించగా ఖాళీ అయిన మేరకు మెయిన్ సోర్స్ ద్వారా తిరిగి దీన్ని నింపుకోవచ్చు. ఇలా అవసరం మేరకు నీరు నిల్వచేయడానికి, తరలించడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పనిచేస్తాయి. మరోవైపు, భారీ వరదల సమయంలో దిగువ ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గించడం, ముంపు ప్రమాదం లేకుండా వరద సక్రమంగా కిందికి సాగిపోవడంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కీలకంగా పనిచేస్తాయి.
మానేరు ప్రాజెక్టులు-వరద కాలువ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పెద్ద నీటి వనరైన గోదావరి నదికి మానేరు ఉపనదిగా ఉంది. మానేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి ఆ జిల్లాలోనే గోదావరిలో కలుస్తుంది. ఒక రకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మానేరు గుండెకాయ వంటిదనే చెప్పుకోవాలి. కరీంనగర్ పట్టణం కూడా మానేరు నది ఒడ్డునే ఉంది. మానేరు నదిపై ఎగువ మానేరు (అప్పర్ మానేరు, మధ్య మానేరు (మిడ్ మానేరు), దిగువ మానేరు (లోయర్ మానేరు-ఎల్ఎండీ) .. ఇలా మొత్తం మూడు ప్రాజెక్టులున్నాయి.
మిడ్ మానేరుతో శ్రీరాంసాగర్ లింక్..
ఈ మిడ్ మానేరు రిజర్వాయర్‌కు మానేరుతో పాటూ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) ప్రధాన నీటి వనరులు. సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) మిగులు జలాలను మిడ్ మానేరుకు తరలించి 2 లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టు సృష్టించే ప్రణాళికలో భాగంగా అప్పటి ప్రధానమంత్రి పీవీ. నరసింహారావు చేతుల మీదుగా వరద కాలువ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది, 2010లో ఈ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువ పొడవు 130 కిలోమీటర్లు. అయితే, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు, చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో నీటి లభ్యత తగ్గిపోయి ఎస్సారెస్పీ నిండటమే గగనం అయింది. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాక, గాయత్రి పంప్ హౌజ్ ద్వారా మిడ్ మానేరుకు నీరందుతోంది.
లిఫ్ట్ ఇరిగేషన్‌లో కాళేశ్వరం కీలకపాత్ర
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 13 జిల్లాల పరిధిలో 19 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలన్నది తమ లక్ష్యంగా తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఒక నివేదికలో చెప్పింది. ఈ లక్ష్యం నెరవేర్చడంలో మిడ్ మానేరు ప్రాజెక్ట్‌ది కీలక భూమికగా భావిస్తారు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి తరలించి తెచ్చే నీటిలో సుమారు 100 టీఎంసీల నీరు ఈ రిజర్వాయర్ గుండానే వెళ్లాలి. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యాలను బట్టి చూస్తే .. లోయర్ మానేరు (24 టీఎంసీ), అన్నపూర్ణ (3.5 టీఎంసీ), రంగనాయకసాగర్ (3 టీఎంసీ) , మల్లన్న సాగర్ (50 టీఎంసీ), కొండపోచమ్మ సాగర్ (15 టీఎంసీ)కు నీరు మిడ్ మానేరు నుంచే అందాలి. ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్‌లో 5 టీఎంసీలు, అన్నపూర్ణలో 0.8 టీఎంసీ, రంగనాయక సాగర్‌లో 0.85 టీఎంసీ, మల్లన్న సాగర్ 9.56 టీఎంసీలు (ఏప్రిల్ 10 నాటికి) నీటి నిల్వలున్నాయి. ఇక.. కాళేశ్వరం (మేడిగడ్డ బరాజ్) ద్వారా 2019-23 వరకు 162 టీఎంసీల గోదావరి జలాలను తరలించారు. మొదటిసారి 2019-20 సీజన్ లో 61 టీఎంసీలు ఎత్తిపోస్తే, ప్రస్తుత సీజన్ (2023-24)లో కేవలం 8.9 టీఎంసీలు మాత్రమే తరలించారు. ఇదే కాళేశ్వరం నుండి 2019-2023 మధ్య కాలంలో గాయత్రి పంప్ హౌజ్ ద్వారా మిడ్ మానేరు కు అందిన నీరు మొత్తం 180 టీఎంసీలు.
వ్యవసాయ శాఖ ప్రణాళిక ఇదే..
వ్యవసాయ సీజన్ల వారిగా చూస్తే.. 2019-20 లో 66.44 టీఎంసీలు చేరితే, ఈ సీజన్ (2023-24) లో కేవలం 10.34 టీఎంసీలు మాత్రమే కాళేశ్వరం నుంచి పంపింగ్ అయ్యాయి. గతేడాది చూస్తే 31.3 టీఎంసీలు నీరు వచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంతో అక్కడి నుంచి నీరు పంపింగ్ కాకపోవడం దీని వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిడ్ మానేరుతో ముడిపడి ఉన్న రంగనాయక సాగర్ కింద 1.14 లక్షలు, కొండపోచమ్మ సాగర్ కింద 2.85 లక్షలు, మల్లన్న సాగర్ కింద 8.33 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలన్నది నీటి పారుదల శాఖ లక్ష్యం. అదే సందర్భంలో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్ ల గుండా నీటిని ఎస్సారెస్పీ వరకు తరలించాలన్నది ఆ శాఖ మరో ప్రణాళిక.
యాసంగి పంటలకు పెద్ద దెబ్బ..
కాళేశ్వరం, దానితో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్ట్‌లన్నింటి కింద, ముఖ్యంగా అన్ సీజన్‌లో (యాసంగి) కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు ముడిపడి ఉన్నాయి. అలాగే మార్గమధ్యలో చెరువులు, కుంటలు నింపడానికి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అవసరాలు కూడా తీరాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి పంటలను కాపాడుకునేందుకు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి పెద్ద ఎత్తున వస్తోంది. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో రైతులు ఆందోళనల కూడా చేపట్టారు. ఇటీవలే లోయర్ మానేరు కింద పంటల కోసం 3 వేల క్యూసెక్కులు కాకతీయ కెనాల్ ద్వారా వదిలారు. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి వాగులోకి కొంత నీటిని వదిలారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గాయత్రి పంప్ హౌజ్ పంప్ లను కొద్ది సమయం నడిపి నీటిని వరద కాలువలోకి వదిలారు.
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలేనా?
కాళేశ్వరంలో భాగంగా హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీరు కేటాయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లింక్‌గా డైరెక్ట్ పైప్ లైన్ ఒకటి వేశారు. సిద్దిపేట జిల్లా పరిధిలో ఈ పైప్ లైన్‌కే మరికొన్ని కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి నీరు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల నుంచి రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాకాలం సీజన్ వస్తే తప్ప అది సాధ్యపడే పరిస్థితులు లేవు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సుందిల్ల బరాజ్ నుంచి వచ్చే నీరు ఎల్లంపల్లికి చేరడం ఇప్పట్లో సాధ్యపడదు. దీంతో భవిష్యత్తులో హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.