కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని ఇప్పటికే పలువురు హెచ్చరించారు. సింగపూర్ వైరస్ రకం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, థర్డ్ వేవ్ రూపంలో సింగపూర్ వైరస్ భారత్‌ను తాకొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు కనిపించవని ఆయన వెల్లడించారు. కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందని తెలిపారు. అయితే వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే లక్షణాలు కనిపించకపోయినా ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలని సూచించారు.
గతంలో 10 ఏళ్ల లోపు చిన్నారులపై సర్వే చేసినప్పుడు పెద్దల్లో ఎంత మేర పాజిటివిటీ రేటు కనిపించిందో పిల్లలపైనా అంతే కనిపించిందని వీకే పాల్ తెలిపారు. కాబట్టి కరోనా వైరస్ చిన్నారులకు సోకుతుంది కానీ లక్షణాలు కనిపించడం లేదన్నారు. పిల్లలపై కొవాగ్జిన్ టీకా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చామని, మరో 10-15 రోజుల్లో ఈ ప్రయోగాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తాము ఇంకా సింగపూర్ వైరస్ రకంపై అధ్యయనం చేయలేదన్నారు. అధికారిక సమాచారం అందిన తర్వాత తాము పరిశీలించి స్పందిస్తామని తెలిపారు.