Friday, November 22, 2024

ష‌ర్మిల పిలిచినా ఒక్క‌రూ రారేమి…

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : పార్టీ పెట్టి సంచలనం సృష్టిద్దామనుకున్న వైఎస్‌ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు సంచలనాలు సృష్టిస్తుందని అందరు కూడా అనుకున్నారు. తండ్రి దివం గత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు, పక్క రాష్ట్రం ఏపీ సీఎంగా ఆమె అన్న వైఎస్‌ జగన్‌ ఉన్నారు. రాజకీయ నేపథ్యం ఉండడంతో పాటు అప్పటికే దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ పట్టుదలతో పార్టీని ముందుకు నడుపుతారని, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండవని, పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుని అసెంబ్లిdలో అడుగుపెడుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలకు కలిసి రావాలని వైఎస్‌ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇచ్చిన పిలుపుకు విపక్షాల నుంచి స్పందన కనిపించడం లేదు. అదేమో కానీ, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్నివిపక్ష పార్టీలు ఆమె పార్టీతో కలిసి పోరాడేందుకు విముఖత చూపుతున్నాయి.

పలు సమస్యలపై ఆమె కలిసి పోరాటాలు చేద్దామని ఇచ్చిన పిలుపును నేతలు పట్టించుకోవడం లేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, నిరుద్యోగుల సమస్యలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, గవర్నర్‌కు వ్యతిరేకంగా అధికార పార్టీ విధానాలు, విపక్ష పార్టీలు చేపట్టే ధర్నాలు, ర్యాలీలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కలిసి విన్నవించడం తదితర సమస్యలపై అఖిలపక్ష పార్టీలుగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు కలిసి రావాలని కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, మజ్లిస్‌, బీఎస్పీ, టీజేఎస్‌, మహజన సోషలిస్ట్‌ పార్టీ పార్టీల అధ్యక్షులకు స్వయంగా లేఖలు రాశారు. ఒక్క టీజేఎస్‌ తప్ప మిగతా పార్టీలేవీ స్పందించలేదు. బీజేపీ ఉన్న వేదికలను తాము పాలుపంచుకునే ప్రసక్తిలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎ ం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అదే విధంగా అఖిలపక్షంలో బీజేపీ ఉంటే తాము కలిసి వచ్చేప్రసక్తిలేదని టీపీసీసీ చీఫ్‌ ఎ రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు.

అలాగే, కాంగ్రెస్‌ , లెఫ్ట్‌ పార్టీలు ఉంటే తాము వచ్చేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మోహమాటంగా స్పష్టం చేశారు. ఇలా ఆమె పిలుపు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఉమ్మడి పోరాటాలపై కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసేందుకు ఎంబి భవన్‌కు వెళ్లిన షర్మిలకు చేదుఅనుభవం ఎదురైంది. ఇద్దరు నేతల మధ్య దాదాపు వాగ్యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. షర్మిల తనదైన శైలిలో తమ్మినేనిపై వ్యాఖ్యలు చేశారు. మహిళా నేత కదా అని తాము గౌరవంగా కార్యాలయానికి ఆహ్వానిస్తే ఆమె కించపరుస్తూ మాట్లాడారని విలేఖరుల సమావేశంలోనే తమ్మినేని విరుచుకుపడ్డారు. రెండు పార్టీల సారథులు ఒకే సమావేశంలో పరస్పరం విమర్శించుకోవడం ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగలేదు. సీపీఐ కార్యాలయం మఖ్ధూంభవన్‌కు వెళ్లినప్పుడు కూునంనేని సాదర స్వాగతం పలికారు. కానీ, ఆమె చేపట్టే కార్యక్రమాలకు వెళ్లలేదు. మజ్లిస్‌ పార్టీ అయితే తమ స్పందనను ప్రకటించలేదు. బీఎస్పీ అసలు పట్టించుకోలేదు. విపక్ష పార్టీలు స్పందించకపోవడంతో ఉద్యోగ ఖాళీల భర్తీ, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీకి బాధ్యులపై సీబీఐ లేదా సి ట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్లపై ఇందిరాపార్క్‌ వద్ద ఒంటరిగానే ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ప్రధాన పార్టీలు పాల్గొనలేదు. న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, కొన్ని బీసీ సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. ప్రజాగాయకుడు గద్దర్‌ దీక్షకు మద్దతు ఇచ్చారు. హైకోర్టు అనుమతి తోనే దీక్షలు, ధర్నాలు, యాత్రలు చేయాల్సిన పరిస్థితి ఆమెకు రావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement