న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎప్పుడు సస్పెన్షన్ జరిగినా సభ్యుల దుష్ప్రవర్తనను ఖండించడం కోసమేనని, సభలో జరిగిన అప్రజాస్వామిక చర్యలను నిరాకరించడం కోసమేనని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ అంశంపై గురువారం ఆయన మాట్లాడుతూ… మూడు రోజులుగా సభ సజావుగా జరగలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం పునాదులుగా దేశ నిర్మాణం జరగాలని రాజ్యాంగం ఏర్పడిందని, ఈ క్రమంలో చట్టసభలకు, సభ్యులకు రాజ్యాంగం కీలక బాధ్యత అప్పగించిందని వెంకయ్య వివరించారు. సస్పెన్షన్‌ను కొందరు సభ్యులు అప్రజాస్వామికం అంటుండడం వల్ల సభను వేదికగా చేసుకుని తన ప్రతిస్పందన తెలియజేస్తున్నానన్నారు.
చరిత్రలో సస్పెన్షన్ అనేది తొలిసారిగా జరగలేదని, 1962 నుంచి 2010 వరకు 11 సార్లు సస్పెన్షన్లు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవన్నీ కూడా అప్రజాస్వామికమేనా? అలా అయితే ఇన్ని సార్లు ఎందుకు పునరావృతమయ్యాయని ఛైర్మన్ ప్రశ్నించారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నప్పుడు రూల్ 255, 256 ప్రకారం సభ్యులను సస్పెండ్ చేస్తారని, తాజా సస్పెన్షన్ వెనుక కారణమేంటో అందరికీ తెలుసని అన్నారు. వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న ఆ తరహా దుష్ప్రవర్తనను, ఘటనను నేను మళ్లీ గుర్తుచేయాలనుకోవడం లేదని వాపోయారు. సస్పెన్షన్‌ను అప్రజాస్వామికం అంటున్నవారు ప్రజాస్వామ్య దేవాలయ పవిత్రతను ఆ సభ్యులు అవమానించిన తీరు గురించి మాట్లాడ్డం లేదని వెంకయ్య అన్నారు.
దీన్నిబట్టి చూస్తే పవిత్ర సభను అవమానించడం తప్పుకాదు, అలా చేసినందుకు చర్య తీసుకోవడమే అప్రజాస్వామికమనే సందేశాన్ని వారు పంపుతున్నారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి వీరు చెబుతున్న సరికొత్త నిర్వచనాన్ని దేశ ప్రజలు స్వీకరించరని తాను బలంగా నమ్ముతున్నాననని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలోనూ సస్పెన్షన్లు జరిగాయి…. తమ తప్పును గ్రహించిన సభ్యులు క్షమాపణ కోరిన సందర్భాల్లో మధ్యలోనే సస్పెన్షన్ రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయని వెంకయ్య గుర్తు చేశారు. కానీ ఈ 12 మంది సభ్యులు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తున్నారని,
ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో చెప్పండన్నారు. చేసిన తప్పు గురించి పశ్చాత్తాపం లేదు కానీ సస్పెన్షన్ ఎత్తేయాలని మాత్రం డిమాండ్ చేస్తారా? ఇదే ప్రజాస్వామ్య సూత్రమా? అని ప్రశ్నించారు.
సభ్యులు విచారం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ఎత్తేయడాన్ని పరిగణిస్తామని అధికారపక్ష నేత చెప్పారని, డిప్యూటీ చైర్మన్ కూడా ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారని ఛైర్మన్ వెల్లడించారు. తప్పు చేయడం మానవ సహజమని, అలాగే వాటిని సరిదిద్దుకోవడం కూడా మనిషి తత్వమని, తప్పును సరిదిద్దుకోను అనడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు. సభ్యులందరూ కూర్చుని తదుపరి ఏం చేయాలో నిర్ణయించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..