Friday, November 22, 2024

ఏపీలో పరిషత్ వేడి!

ఏపీలో పరిషత్ ఎన్నికల వేడి పెంచుతోంది. ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్నాక పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్షించామని ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. అంతా సమీక్షించిన తర్వాతే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. గతంలో ఆగిన ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచి ఎన్నికల నిర్వహణకు సన్నద్దంగా ఉన్నామని చెప్పిన మీదట నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిందని… ఇంకా జాప్యం జరగడం మంచిది కాదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ వ్యవస్థే ఇప్పుడూ పని చేస్తోందని… ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వీకరిస్తామని తెలిపారు. ఈనెల 6 వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు అని నీలంసాహ్ని చెప్పారు.

మరోవైపు  రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. విజయవాడలో ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైసీపీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి, సీపీఎం పార్టీ ప్రతినిధి హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ నేత మస్తాన్‌వలి హాజరై మధ్యలోనే బయటకు వచ్చారు. టీడీపీ, బీజేపీ జనసేన, సీపీఐ ఇప్పటికే ఈ సమావేశాన్ని బహిష్కరించింది.

ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఎస్​ఈసీని కోరారు. ప్రతిపక్షాలు సమావేశాన్ని బహిష్కరించడం దారుణమన్నారు. ఎన్నికలను తప్పించుకోవాలన్నదే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని కామెంట్లు చేసిన నోళ్లే.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరు కారా ? అని ప్రశ్నించారు.

మరోవైపు హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రాకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక సమావేశం ఎందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కోర్టులో విచారణ జరుగుతున్నా ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారని… ఎస్ఈసీ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని జనసేన నేత పోతిన మహేశ్ అన్నారు. ఈ నిర్ణయం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనని జనసేన భావిస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని ఆరోపించారు. పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement