Friday, November 22, 2024

దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలి: మోదీ

దేశంలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని అన్నారు. మరోసారి మహమ్మారిపై భీకర యుద్ధం చేస్తున్నామని తెలిపారు. కరోనా సెకెండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉందన్నారు. మనందరం కలిసి ఈ పరీక్షను ఎదుర్కొందాం అని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న వైద్య సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

కొన్ని రోజుల క్రితం కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మరోసారి తుపాన్‌లా విరుచుకుపడుతోందని ప్రధాని తెలిపారు. అందరం కలిసి కట్టుగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను అంతమొందించే పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను ప్రశంసించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ వారు దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదని సూచించారు.

దేశంలో ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగం కూడా ఈ దిశగా కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. ఆక్సిజన్ ప్రత్యేక రైలు.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీరుస్తోందన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి అని మోదీ అన్నారు. యువకులు గ్రూపులుగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా పెంచుకున్నామన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని, కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు.

 కరోనా సెకండ్ వేవ్ ఎన్నో సవాళ్లు విసురుతోందని ప్రధాని మోదీ అన్నారు. అయితే, ఆ సవాళ్లను మనం ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు చేశారు. అత్యంత కఠిన సమయాల్లో మనం ధైర్యం కోల్పోకూడదని శాస్త్రాల్లో ఉందని, అలా ధైర్యం కోల్పోకుండా సరైన దిశలో ముందుకు సాగితే మనం కరోనా మీద విజయం సాధిస్తామని మోదీ చెప్పారు. దేశంలోని ఫార్మా దిగ్గజాలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలిపారు. ఉత్పత్తి పెంచడానికి అన్ని ఫార్మా కంపెనీలకు మద్దతు లభిస్తోందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచడానికి కృషి జరుగుతోందని మోదీ తెలిపారు.

శాస్త్రవేత్తలు రాత్రీపగలు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్‌ సంస్థల కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకాలు అందిస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వైద్యారోగ్య సిబ్బందికి ఫలాలు అందుతున్నాయన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించనున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement