Tuesday, November 26, 2024

కర్ఫ్యూ ప్రచారంలో నిజమెంత?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలా? లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వార్తలు వినిపించాయి. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

పాత బస్తీలోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ లేవని తేల్చి చెప్పారు. ఈ లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ స్పష్టం చేశారు. అయితే, పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు, మదర్సాలు పనిచేయనివ్వాలా ? లేదా  అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఫేస్ మాస్క్‌లను తప్పని సరిగా ఉపయోగించాలని హోంమంత్రి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement