Tuesday, November 19, 2024

కరోనా ఎఫెక్ట్: రైల్వే సేవలు ఆపేస్తారా?

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను కూడా ఆపేస్తారన్న ప్రచారం వలస కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్‌డౌన్ భ‌యాల‌తో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబై, పూణె. అహ్మదాబాద్ తదితర ప్రముఖ నగరాల నుంచి యూపీ, బీహార్‌కు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తే ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. రైల్వే సేవలను పూర్తిగా ఆపేస్తారన్న ప్రచారంతో వలస కార్మికులు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు.

అయితే, రైల్వే సేవలను పూర్తిగా రద్దు చేస్తారనే ప్రచారంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌ని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. ప్ర‌యాణించాల‌నుకున్న వాళ్ల‌కు రైళ్ల కొర‌త లేద‌న్నారు. దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రైళ్లను నిలిపివేసే యోచన రైల్వే శాఖకు లేదన్నారు. వేసవికాల ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు తెలిపారు. వేసవికాలంలో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ సహజమేనని పేర్కొన్నారు. ఇక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా అవ‌స‌రం లేద‌ని సునీత్ స్పష్టం చేశారు.

గతేడాది కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అన్నిరకాల సేవలు నిలిచిపోయాయి.బవ్యాపార, వాణిజ్య సేవలతో పాటు ప్రజా రవాణా స్తంభించింది. బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, అన్ లాక్ లో భాగంగా పలు రైళ్లను నడిపిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement