తెలంగాణలలో జులై 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆన్లైన్లోనే బోధన కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తామన్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేనివారికి గతేడాది మాదిరిగానే.. దూరదర్శన్ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్లైన్ బోధన నిర్వహిస్తామని తెలిపారు. రికార్డ్ చేసిన పాఠాలు అన్నీ టీ శాట్ యాప్స్‌లో అందుబాటులో ఉంటాయని వివరించారు. సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో ఎలాంటి మార్పుల్లేవని, ఇంతకు ముందు ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ప్రయివేటు పాఠశాలలు తప్పనిసరిగా 46 జీవోను అమలు చేయాలన్నారు. ఈ ఏడాది కూడా ట్యూషన్ ఫీజుల మాత్రమే వసూలు చేయాలని సూచించారు. 30 శాతం ఫీజులు తగ్గించుకోమని కోరినట్లు మంత్రి తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు జులైలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు రద్దు కావని మంత్రి సబిత స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన 90 శాతం పుస్తకాలు జిల్లాలకు చేరినట్లు తెలిపారు. 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరు కావాలన్నారు. రోజు విడిచి రోజు టీచర్లు విధులకు హాజరు అవ్వాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. కాగా, జులై1 నుంచి ఫిజికల్ క్లాసులు మాత్రం నిర్వహించడం లేదు.
ఇది కూడా చదవండి: వస్తూనే ఉత్తమ్‌కు రేవంత్ షాక్! హుజురాబాద్ లో కొత్త అభ్యర్థి?