దేశంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాలతో ప్రజలు హ్యాపీగా లేరని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవ్వాల (శనివారం) రాత్రి సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీవ్రం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములను లాక్కుంటూ సీఎం కేసీఆర్ రైతుల గొంతునొక్కుతున్నారని, కేంద్రం తీసుకురావాలనుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయల నుంచి 11 వందలకు పూగా చేరిందని, పెట్రోల్ ధర 110 రూపాయలకు పెరిగిందని, దీంతో పేదలు మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఈ జోడో యాత్ర చేపట్టామని, ప్రజల ప్రేమ, ఆప్యాయత వల్ల పాదయాత్రలో ఎట్లాంటి అలసట రావడం లేదని రాహుల్ అన్నారు. రైతులు, యువత, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యాజమానుల సమస్యలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు వెళ్తున్నారు రాహుల్.