దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులపై కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఆ 13 మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించామన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదు అయ్యాయి. నిన్న(డిసెంబర్ 4) గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకటి, ముంబైలో మరో కేసు నమోదైంది.