దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోకి ఇప్పటి వరకు కొత్త వేరియంట్ ప్రవేశించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 13 మంది అనుమానితులకు ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాలేదని తెలిపారు. డిసెంబర్ 1వ తేది నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను ల్యాబ్ కు పంపించగా.. ఏ ఒక్కరికి ఒమిక్రాన్ సోకలేదని తేలింది. ప్రస్తుతం ఆ 13 మంది గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాకటలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి.