Tuesday, November 26, 2024

Big News: తెలంగాణలో లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్య

తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. మున్సిపాలీటీల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. 

కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య ఆరోగ్య శాఖపై సిఎం కెసిఆర్ నిన్న(జనవరి 3) ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎంకు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడే లాక్ డౌన్, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ కు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని చెప్పారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని సీఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖను సన్నద్ధం చేయడం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement