కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమౌతోంది. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మాస్క్ లేకుండా సంచరించకూడదనే నిబంధనను మళ్లీ డీజీసీఐ తీసుకొచ్చింది. నోమాస్క్ నో ఎంట్రీ రూల్‌ని విమానాశ్రయాల్లో స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. నిన్న దేశవ్యాప్తంగా 3 వేల 714 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, బుధవారం 5 వేల 233 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 31 లక్షల 90 వేల 282 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 28 వేల 857 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు కొవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖను అలర్ట్ చేసింది. విమాన ప్రయాణికులు ఇకనుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీజీసీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే..బోర్డింగ్ వద్దే ప్రయాణికుల్ని నిలిపివేయనున్నారు. మాస్క్ ధరిస్తేనే విమానాశ్రయంలో అనుమతి ఉంటుంది.