Sunday, November 17, 2024

రాబడికి ఢోకా లేదు.. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్..

ప్ర‌భ‌న్యూస్: సంపద సృష్టి.. ఆర్థిక ప్రగతి.. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో అభివృద్ధి… సంక్షేమం ఇలా అన్ని అంశాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. తలసరి ఆదాయంలో దక్షిణాదిలోనే అగ్రభాగాన నిలిచిన తెలంగాణ జాతీయ సగటును మించిపోయింది. రాబడి పరంగా కేంద్రానికి చేదోడువాదోడుగా నిలుస్తున్న 4వ రాష్ట్రంగానూ ఘనత సాధించింది. కేవలం ఆరేళ్లలో ఇది సాధ్యమైంది. ఇవి అధికారపక్షం చెప్పిన గొప్పలు కాదు. సాక్షాత్తు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలో పేర్కొన్న నిజాలు. సీఎం కేసీఆర్‌ దక్షత, ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం అద్భుత స్థానంలో ఉంటూ ప్రగతిని కొనసాగిస్తున్న తీరును ఆర్బీఐ నివేదిక కళ్లకు కట్టింది. ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే దేశాన్ని ఆదుకునేలా గడచిన ఆరేళ్లలో తెలంగాణ అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. తెెలంగాణ అభివృద్ధి, సంక్షేమం సహా, దేశ సగటు ఎదుగులకంటే మెరుగ్గా ఉందని ప్రశంసించింది.

రాష్ట్ర తలసరి ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు అయ్యిందని, ప్రస్తుత ధరల రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అద్భుతంగా పెరగడంతో తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిల్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏకంగా 91.5 శాతం మేర పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిల్చిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఆరేళ్లలో ఇది 93.8శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో 11వ పెద్ద రాష్ట్రమని, జనాభాలో 12వ స్థానంలో నిల్చిందని ఈ నివేదిక వెల్లడించింది. దేశానికి ఆర్థిక చేయూతనిస్తున్న రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ నాల్గో స్థానంలో నిల్చింది. పన్నులు, ఇతర రాబడులను కేంద్రానికి అందిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ ప్రస్తుత ధరలవద్ద 93.8శాతం వృద్ధిరేటును సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ దేశంలోనే మూడో అత్యధిక వృద్ధిరేటును పొందిన రాష్ట్రంగా నిల్చింది. దేశమంతటా ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ తెలంగాణ రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంది. దేశ వృద్ధిలో కీలకమైన జీడీపీలో తెలంగాణ 4వ అతిపెద్ద రాష్ట్రంగా కీర్తించింది. తెలంగాణ ప్రజల ఆదాయ స్థితిగతులు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో తలసరి ఆదాయం అత్యధికంగా నమోదవుతున్నది. తెలంగాణ రాష్ట్ర అప్పులు అదుపులో ఉంటూ జీఎస్‌డీపీలో నిర్దేశిత శాతానికి లోబడి ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో ఆర్థికరంగంలోనే కాకుండా అన్ని రంగాలు వృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. వార్షిక సగటు వృద్ధిరేటులో దక్షిణ భారతంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిల్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement