Friday, November 22, 2024

హిజాబ్‌, హలాల్‌ వద్దు.. ఐటీ, బీటీలపై దృష్టిపెడదాం – డీకే శివకుమార్‌, కేటీఆర్ మధ్య ట్విట్టర్ చ‌ర్చ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కర్నాటక రాజధాని బెంగళూరు మహానగరంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని కొన్ని రోజుల క్రితం ప్రముఖ అకౌంటింగ్‌ స్టార్టప్‌ కంపెనీ ఖాతాబుక్‌ సీఈవో తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌ బదులిస్తూ.. మీరంతా హైదరాబాద్‌కు రావొచ్చు అని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలున్నట్లు ట్వీట్‌ చేశారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌పై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌లో తెలిపారు. అయితే ఆ ట్వీట్‌కు ఇవాళ కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్‌.. మీ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామన్నారు. 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ బెంగళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకురానున్నట్లు ట్వీట్‌ చేశారు.

శివకుమార్‌ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. శివకుమార్‌ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ శివకుమార్‌కు రిప్లై ఇచ్చారు. దేశ యువత, సౌభాగ్యం కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేటీఆర్‌ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన,ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), బయో టెక్నాలజీ(బీటీ)లపై ఫోకస్‌ పెడుదాం కానీ హలాల్‌, హిజాబ్‌ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement