నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) అంటే.. బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిసి ఏర్పడ్డ కూటమిని ఏన్డీఏగా పిలుస్తారు. దేశంలో అధికారంలోకి రావడానికి 1998లో ఈ పొలిటికల్ అలయోన్స్ ఏర్పాటైంది. అయితే.. ఇప్పుడీ కూటమి నుంచి మిత్రపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వస్తున్నాయి. మొన్నటిదాకా దోస్తానా చేసిన బీహార్ లీడర్ నితీష్ కుమార్ పార్టీ జనతాదల్ (యునైటెడ్) కూడా ఇప్పుడు చీ పో అంటూ చీత్కరించుకుని విడిపోయింది. ఇక.. బీహార్‌లో బీజేపీతో కలిసి అధికారం చేపట్టిన నితీష్‌కుమార్ ఇప్పుడు రాష్ట్రీయ జనతాదల్ (ఆర్జేడీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. దేశంలో ఏకఛత్రధిపత్యం చేయాలన్న దురాశకుతోడు, అన్ని రాష్ట్రాల్లో తామే విస్తరించాలనే రాజకీయ ఆపేక్షతోనే బీజేపీని ఇతర పార్టీలు నమ్మడం లేదన్న వాదనలున్నాయి. అందుకే ఆ కూటమిలోని పార్టీలన్నీ ఎన్డీఏకి దూరం అవుతూ వస్తున్నాయి.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ)ని 1998లో ఏర్పాటు చేశారు. దీనికి మొదటి చైర్మన్‌గా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ 2004లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 2014 వరకు పనిచేశారు. ఆ తర్వాత అమిత్ షా 2014 నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 1998 నుంచి 2004 వరకు సంకీర్ణ పాలన సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఓట్ల వాటా 38.5% ఉండడంతో దీని నాయకుడు నరేంద్ర మోడీ 26 మే 2014న భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి 45.43% ఓట్ల వాటాతో 353 లోక్‌సభా స్థానాలను గెలుచుకుని లోక్‌సభలో తన సంఖ్యను మరింత పెంచుకుంది.
ఈ కూటమి స్ట్రక్చర్ ఏంటంటే..
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు ఎగ్జిక్యూటివ్ బోర్డు లేదా పొలిట్‌బ్యూరో వంటి అధికారిక పాలనా నిర్మాణం లేదు. ఎన్నికల్లో సీట్ల పంపకాలు, మంత్రిత్వ శాఖల కేటాయింపులు, పార్లమెంట్‌లో లేవనెత్తే అంశాలపై ఆయా పార్టీల నేతలే నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది. పార్టీల మధ్య భిన్నమైన సిద్ధాంతాల దృష్ట్యా, మిత్రపక్షాల మధ్య అసమ్మతి తలెత్తుతోంది. 2008 వరకు ఎన్‌డీఏ కన్వీనర్‌గా జార్జ్ ఫెర్నాండెజ్ బాధ్యతను నిర్వర్తించారు. ఫెర్నాండేజ్ హెల్త్ బాగాలేని కారణంగా అతని స్థానంలో అప్పటి జేడీ(యు) రాజకీయ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న శరద్ యాదవ్‌ను నియమించారు.
కాగా, 2013, జూన్ 16న JD(U) ఈ సంకీర్ణాన్ని విడిచిపెట్టింది. దాంతో శరద్ యాదవ్ NDA కన్వీనర్‌గా రాజీనామా చేశారు. ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు NDA కన్వీనర్‌గా చేశారు. ఇక.. 2017 జులై 27న బీహార్‌లో బీజేపీ సహకారంతో జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని తర్వాత అదే సంవత్సరం ఆగస్టు19న JD(U) అధికారికంగా 4 సంవత్సరాల తర్వాత NDAలో తిరిగి చేరింది. గతంలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉంది.
అయితే.. సంకీర్ణంలో భాగంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భాగస్వామ్య కూటమి పాలన సాగించింది. ఇక.. కేరళ, తెలంగాణ, (1999–2004 మధ్య కాలంలో బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకుని) పశ్చిమ బెంగాల్ వంటి దక్షిణాదిలోని మూడు కీలక రాష్ట్రాలలో పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరడం లేదు. ఇక్కడ ఆ పార్టీ పాచికలు అస్సలు పారడం లేదనే చెప్పుకోవాలి.
ఎన్‌డీఏ అలయెన్స్ అంటే ఇప్పుడు బీజేపీనే!
ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి అంటే ఒక్క బీజేపీ మాత్రమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఆ పార్టీ కూటమి పేరుతో చేస్తున్న విపరీత ధోరణులతో అలయెన్స్‌లోని ఒక్కో మిత్రపక్షం దూరమవుతూ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధికోసం, ఒంటరిగా బలపడాలనే స్వార్థం కోసం బీజేపీ ఆడుతున్న ఆటలో మిగతా పార్టీలన్నీ చెల్లా చెదరవుతున్నాయి. అయితే.. తన మిత్రపక్షంలోని స్నేహితులను కాపాడుకోవడంలో బీజేపీ పెద్దలు విశ్వసనీయత కోల్పోతున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతోంది.
అన్ని మిత్రపక్షాలు అవుట్..
2018 నుంచి పరిశీలిస్తే.. ఎన్‌డీఏ కూటమి నుంచి తొలుత ఏపీలోని తెలుగుదేశం పార్టీ అవుట్.. ఆ తర్వాత పంజాబ్ నుంచి ఆకాళీదల్, మహారాష్ట్రలోని శివసేన దూరం, ఇప్పుడు బీహార్‌లోని జేడీయూ కూడా రాం రాం అనేసింది. ఇంతకుముందే తటస్థుల జాబితాలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అంటే దేశ రాజకీయాల్లో బలమైన లీడర్ కేసీఆర్ కుడా దూరమయ్యారు.
ఇప్పటికైతే ఎన్డీఏలో బీజేపీతో అంటకాగుతున్న వాళ్లెవన్నది పరిశీలిస్తే.. శివసేన రెబల్ గ్రూపు (ఏక్నాథ్ షిండే), అన్నాడీఎంకే(తమిళనాడు) తప్ప.. దేశంలో బలమైన పార్టీ కానీ, బలమైన లీడర్లు కానీ ఎవరూ లేరనే చెప్పవచ్చు. అయితే. ఇక్కడ అధికారం కోసమో, భయమో, నిర్బంధమో, ఇంకా ఏ కారణం చేతనైనా కావచ్చుగాక.. కొన్ని పార్టీలు (ఆంధ్రప్రదేశ్ వైసీపీ) బీజేపీకి పలు అంశాలో సపోర్ట్‌గా నిలుస్తున్నాయనే చెప్పాలి.