Sunday, November 24, 2024

చెట్ల కిందే చదువులు.. పర్యవేక్షించని అధికారులు

కొత్తగూడ(ప్రభ న్యూస్): ప్రతీ విద్యాసంవత్సరం ప్రారంభంలో బడి బాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అట్టహాసంగా విద్యార్థులను బడిలోకి ఆహ్వానిస్తోంది. పాఠశాల బయటినుండి చూడడానికి పచ్చని చెట్ల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో కనబడుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, కరోనా తర్వాత ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బడి బాట కార్యక్రమం ద్వారా పాఠశాలలో చేరిన విద్యార్థులు తీరా వచ్చాక చూస్తే గదుల కొరత కనబడుతున్నది. ఓవైపు ప్రభుత్వ బడులు దివాళా తీస్తుంటే మరోవైపు కార్పొరేట్ స్కూళ్ల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. 2017-2018 విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి రాజబోయిన శివకుమార్ సుమతి శతకంలోని వంద పద్యాలనూ 4 నిమిషాల 30 సెకండ్లలో చదివి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. అలాంటి పాఠశాల నేడు శిధిలావస్థలో దర్శనమిస్తోంది.

కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి  గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో శిధిలావస్థలో కనబడుతుంది. ఈ పాఠశాలలో తెలుగు మాధ్యమం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తరగతులు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలో మొత్తం కలిపి 102 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్న ఒక్క తరగతి గదిలోనే ఆఫీస్, స్టాప్ రూం, క్లాస్ రూంగా ఉన్నాయి. గదులు సరిపోక ప్రక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రం వారి మంచితనంతో తరగతి గదుల సర్దుబాటు ఉపయోగిస్తున్నారు. మిగిలిన విద్యార్థులంత చెట్ల కింద విద్యను అభ్యసించడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చేందంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే గదిలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పిల్లలందరూ కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిఇలావుంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మధ్యాన్నభోజనంను వడ్డించే గదులు లేక వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. వర్షకాలంలో వంటలు చేస్తున్న క్రమంలో స్లాబ్ నుండి పెచ్చులు ఊడిపడడంతో వర్కర్లు శిధిలావస్థలో గదుల్లోకి వెళ్ళడం మేనేశారు. వంటలకోసం ఒక చిన్న డేరాను ఏర్పరచుకొని వంటలు వండడంవల్ల పొగ బయటకు పోకుండా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు.

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ సరిపోను గదులు లేవు పాఠశాల విద్యా కమిటి చైర్మన్ అల్లడి రాజు అన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలు ఏడు తరగతులు నడుస్తున్నాయి. ఉపాధ్యాయులు అందరు మంచి విద్యను అందిస్తున్నారు. గదులు లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. మంచి నీటిని భద్రపరచడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం నూతన గదులు ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఇంటింటికి తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరికెల నాగేశ్వరరావు తెలిపారు. ఉన్న ఒక్క గది మధ్యలో గచ్చు చేసి తరగతులు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. కొన్ని సందర్భాలలో చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయని చెప్పారు. అలాంటి సమయాల్లో పిల్లలకు తగలకపోవడం సంతోషకరమైన విషయమన్నారు. తరగతి గదుల విషయంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న గదులను తొలగించి నూతన భవనాలు, మరుగుదోడ్లు నిర్మించాలని కోరారు. ఒక తరగతికి ఒక గది ఉండేలా నూతన భవనాలు నిర్మించాలన్నారు.

మరోవైపు గదులు లేకనే.. చెట్ల కింద చదువులు కొనసాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. బడిలో కూర్చోలంటే భయంగా ఉందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement